భయం ఎందుకు...?


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

భయం ఎందుకు...?

Audio: https://youtu.be/k8cXU6uKlys

యెషయా 35:3,4 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి?.

మనిషిలో భయం లేకపోతే ఓటమి దరిదాపులో కనిపించదు. మనిషి బలహీనత భయం, సాతాను ఆయుధం భయం. మనం చదివిన ఈ వాక్యభాగంలో భయంతోవున్న మనిషిలో కనిపించే మూడు లక్షణాలను చూడగలము.

1. సడలిన చేతులు 2. తొట్రిల్లిన మోకాళ్లు 3. తత్తరిల్లిన హృదయం

అర్ధమయ్యే భాషలో చెప్తాను; ఏదైన భయం మనకు కలిగినప్పుడు, ఎలా స్పందిస్తామంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, నాకేమి చేయ్యాలో అర్ధం కావడంలేదు నా గుండె చప్పుడు నాకినిపిస్తుందని అంటాము. భయం వలనఇలా స్పందిస్తాము అదే ఈ వాక్యభాగంలో చెప్పబడినది.

యేసు ప్రభువు ఎందుకు శరీరధారిగా వచ్చాడో హెబ్రీ 2:15లో పౌలు తెలియజేసాడు. ఎందుకనగా, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుట కొరకే. యేసు ప్రభువు మరణమునకు ఎదురు వెళ్ళి, మరణమును జయించి, ఆ జయమును మనకిచ్చాడు.

పరిస్థితులు మనలను భయపెట్టొచ్చు. తప్పించుకొనే మార్గం కనిపించకపోవచ్చు. సహాయం ఎప్పుడొస్తుందో , ఎలా వస్తుందొనని చింత ఉండొచ్చు. నా చిన్న సేవలో, నా కొద్దిపాటి అనుభవాన్ని బట్టి చెప్పుతున్నాను; మనకు కావలసినవన్ని దేవుడు మన చుట్టునే ఉంచాడు. ఒక్కసారి భయం విడిచి చూడు అన్ని మన చుట్టునే ఉంటాయి.

అబ్రహామునకు పొట్టేలు ఎక్కడ నుండో రాలేదు, ప్రక్కనే ఉంది (ఆది 22:13). హాగరు నీటి కొరకు ఎక్కడికో వెళ్ళలేదు ప్రక్కనే ఉంది (ఆది 21:17-19). నీవు కూడా సహాయం కొరకు ఎక్కడికో వెళ్ళనవసరంలేదు, ఎవరినో ఆశ్రయించనవసరంలేదు భయమును విడిచి ధైర్యముతో అడుగులు ముందుకు వెయి దేవుడు సిద్ధపరచిన మేలులన్ని కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు చేసే ప్రయాణాన్ని ఏది కూడా ఆపలేకపోయింది.

ఈరోజు మనం చేస్తున్న ఈ విశ్వాస ప్రయాణాన్ని, పరలోక ప్రయాణాన్ని ఏ సమస్య కూడా ఆపలేదు

దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవరు? అంటే విరోధులు ఉండరని కాదు మనలను ఆపగలిగే విరోధి ఎవరని అర్ధం. మన దేవునికి రక్షించడం, విడిపించడం చాలా ఇష్టం. ఈ రోజు నీవే స్థితిలోవున్నా నిన్ను రక్షించును.