స్వతంత్రులు

  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

స్వతంత్రులు

Audio:https://youtu.be/BF7f0IP9Sw4

2 Cor 3:17 ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ బానిసత్వం ఉండదు. బానిసత్వం నుండి విడిపించబడినప్పుడు వాడే పదాలు స్వాతంత్ర్యము, స్వేచ్ఛ. మనము దేనికి బానిసలుగా ఉన్నామంటే భయం, పాపం. ఈ భయం నుండి, పాపం నుండి మనకు క్రీస్తు ద్వారా స్వాతంత్ర్యం కలిగింది.

బానిస అధికారం చేయలేడు, స్వాతంత్ర్యం పొందినవాడు అధికారం కలిగివుంటాడు. దేవుడు మనకు పిరికిగల ఆత్మను ఇవ్వలేదు. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు. మనము గెలచుటకే నూతనముగ పుట్టాము. మనలను గెలిపించుటకే యేసయ్య సిలువలో మరణించాడు. ఈ స్వాతంత్ర్యంలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అధికారం భూమిమీద వేటిని బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏ బంధకాన్ని విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుంది. ఏది మనకు హాని చేయదు, ఎవరు మనపై అధికారం చెలాయించరు.

అమెరికా దేశంలోని నల్లవారు బానిసత్వము నుండి విడిపించబడిన తరువాత కూడ 100 సంవత్సరములు వారు బానిసలుగానే బ్రతికారు. అందుకు కారణం స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలియక పోవడం. ఇటువంటి స్థితిలో మనం కూడా ఉన్నామని గ్రహించాలి. అయితే, రక్షించబడకముందు వేటికి బానిసలమయ్యామో రక్షింపబడిన తరువాత కూడా మార్పు కనిపించదు. రక్షణకు ముందు మరణమునకు భయపడేవారము, సమస్యలు, అనారోగ్యం, ఆర్ధిక ఇబందులు ఇలా ప్రతిదానికి భయపడుతు, పాపంలో బంధించబడి ఉన్నాము. రక్షణ పొందిన తరువాత వచ్చిన మార్పు ఎంటంటే ప్రార్థన చేస్తు భయపడతాము, ప్రార్థన చేస్తు పాపం చేస్తాము.

నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామని అనుటకు ఒక సూచన ఎంటంటే; ప్రతివిధమైన బంధకము నుండి విడుదల పొందుకుంటావు, ఒకవేళ బలహీనతలలో ఉన్న దాని నుండి బయటపడుటకు ప్రయత్నిస్తావు.

ఈ రోజు నీవు స్వతంత్రునిగా ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా? లేదా ప్రతి దానికి భయపడుతు పాప బానిసత్వంలో ఉన్నావా? పరీక్షించుకోవాలి...!