దేవుని పైనే ఆధారం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

దేవుని పైనే ఆధారం

Audio: https://youtu.be/HTfcuOSADo4

కీర్తనలు 127:1 యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే.

 మనం ఒకటి గ్రహించాలి, మనవద్ద ఉన్నవి మనం పొందేవి అన్ని కేవలం ఒకే చోటునుండి పొందుతున్నాము. అది కేవలం మన దేవుని నుండియే. మన జీవితంలో ప్రతీ విషయంలో ఆయన మీద ఆధారపడాలి మరియు దేవుడే పునాదిగా ఉండాలి ఆ పునాదే లేనట్లయితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బలమైన పునాదివేసి ఇల్లు కడతామో అప్పుడే ఆ ఇల్లు దృఢంగా మరియు ఎటువంటి పర్యావర ఉపద్రవాలు వచ్చినా నిలబడుతుంది. అదే విధంగా మన నిజ జీవితంలో కూడా దేవుడు అనే ధృడమైన పునాది వేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పడిపోకుండా ఉంటాము. ఈ విధమైన జీవితాన్ని కట్టుకోవాలి అంటే దేవునితో సత్ సంబంధం కలిగి వుండాలి. దేవుడే మన జీవితంలో మూలరాయి అయి ఉండాలి, ప్రతీ విషయంలో ఆయనమీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడడం తగ్గిపోతుందో ఏ కట్టడమైనా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా ఆధారపడి జీవిస్తామో వారి ప్రయాస వ్యర్ధం కానేరదు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది “మనం ఆయన మీద అధారపడినట్లయితే ఆయన మన హృదయ వాంఛలన్ని తీరుస్తాడు”.

మనం ఆధారపడతాము కాని, ఎప్పుడు ఓపికతో కనిపెట్టుకొని ఉండము. ఓపికతో కనిపెట్టుకొనక మన ఇష్టపూర్వకంగా మన స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాము. ఎందుకంటే నాకే అన్ని తెలుసు నా అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు, జీవితం నాకు చాలా నేర్పింది, నాకున్న జ్ఞానంతో నేను ఏదైనా సాధించగలను అనే కొద్దిపాటి గర్వం అనే లక్షణం తో ముందుకు దూసుకు పోతుంటాము. మనకు ఉండే జ్ఞానంతో దేనినైనా మొదలుపెట్టగలము కాని దానిలో విజయాన్ని మాత్రం పొందలేము. గర్వం అనేది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది, అది పూర్తిగా నాశనంచేసి తుదకు నిత్య మరణానికి దారితీస్తుంది. నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు, నీకు ఎటువంటి సమస్య అయినా ఉండవచ్చు అయితే అన్నింటికీ సమాధానం దేవుడే. ఆయనే ప్రతీ సమస్యలను సరిచేయువాడు, విరిగిన వాటిని మరలా చక్కగా అమర్చువాడు. ఎప్పుడైతే ఆయన మీద ప్రతీ విషయంలో ఆధారపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తామో అపుడే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. అంతేకాకుండా నిజమైన సంతోషం, సమాధానం, కనికరం తో చక్కటి పరలోక జ్ఞానాన్ని మనలో నింపుతాడు. మన జీవితం చాలా చిన్నది అయితే దేవుడు ఒక్కడే. ఆయనే మన జీవితానికి పునాది అయితే ఆయనద్వారా సమస్తమూ సాధ్యమే.