మనం చేరుకోబోయే గమ్యం

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

మనం చేరుకోబోయే గమ్యం
Audio: https://youtu.be/NBkhC3eXVX4

రవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అలక్సాండర్ ది గ్రేట్. తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు. క్రీ. పూ. 4వ శతాభ్ద కాలంలో కేవలం 12సంవత్సరాలలో ప్రపంచాన్నంతా జయించి, రాజ్యాల సరిహద్దులను, ప్రపంచ పటాన్నే మార్చేసిన గ్రీకు చక్రవర్తి. రాజు అవ్వడానికి కూడా అర్హతలేని వయసులో ప్రపంచమనే మహా సామ్రాజ్యానికి ఏక చత్రాధిపతి అయ్యాడు. 32వ ఏట మరణించినప్పటికీ, జీవితకాలంలో చేయగలిగినదంతా, సాధించగలిగినదంతా సాధించాడు. అతడు మరణించక ముందు మూడు షరతులను తన తోటి వారితో వివరించాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటికను మోయాలి. నా అంతిమ యాత్రలో నా శవపేటికపై నా సంపదనంతా విసిరేయాలి. నా శవపేటికకు రెండువైపులా రంద్రాలు చేసి నా ఖాళీ చేతులు మాత్రం బయటకు పెట్టాలి. మనం ఎంత సంపాదించినా ఒకనాడు మట్టిలో కలిసిపోతాము, సంపాదించిన ఏఒక్కరూపాయి కూడా తీసుకెళ్లలేము. ఈ మాటలు వాస్తవమే కదా, పుస్తకాల్లో చదువుకున్న అలక్సాండర్ మనకో పాఠాన్ని నేర్పించాడు. ఖాళీ చేతులతో ఈ లోకానికి వస్తాము ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాము. ఇది జీవిత సత్యం.

ఖాళీ చేతులతో ఈ లోకంలో పుట్టి ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలేలోపు మనం కొంత సంపాదించాలి. అది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, డబ్బు లేదా హోదా అసలే కాదు. మనం సంపాదించుకోవలసింది, పొందుకోవలసింది ఒక్కటే అది రక్షణ. అవును మన జీవిత సత్యం ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాము అని నేర్పిస్తుందేమో కాని, రక్షణ మన జీవిత గమ్యానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం అన్ని సాధించాలి. మంచి చదువు, ఉద్యోగం మంచి సంపాదన. వాటితో పాటు మంచి పేరు కూడా. పరలోకమే నా గమ్యం అనుకుంటే ఈ లోకంలో పుట్టడం ఎందుకు? దేవుడు పరలోకాన్ని విడచి ఈ లోకంలోకి రావాలి ఎందుకు?. ప్రియ స్నేహితుడా, మన నడవడి, ఆలోచనలు, మంచితనం, కష్టం, శ్రమ, ఓర్పు, విశ్వాసం ఇవన్నీ రక్షణకు నిదర్శనం. భూమి మీద ఉన్న కాలమంతా వర్దిల్లాల్లి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలి. ఈ మార్గమే మనం చేరుకోబోయే గమ్యానికి మనల్ని చేరుస్తుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు కాబట్టే మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము.

యోహాను 3:15,16 ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.