సమాదానమను బంధం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

సమాదానమను బంధం
Audio: https://youtu.be/mK5AFPmMaX8

మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతోషాలుగా అనుకునే బంధంలో భావాల మధ్య విభేదాలు మొదలవుతే... అది మనల్ని కృంగదీస్తుంది. సరే మనసు మార్చుకొని, గుండెను రాయిచేసి, వారితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ పొతే మనతో ఎవరు ఉండరు, ఆ తరువాత మనం ఒంటరైపోతాము. ఎదుటి వ్యక్తి మనల్ని అర్ధం చేసుకోలేదు, మన మనోభావాలను గౌరవించలేదు వారితో మాట్లాడి ఇంకా ప్రయోజనం ఉండదు అని అనుకుంటే పొరపాటే. మరి ముఖ్యంగా ఎవరితోనైతే అనుదినం మనం కలిసి జీవిస్తామో వారితో ఉన్న సంబంధం మధ్య సమాధానం పొందుకోవడం అతి ప్రాముఖ్యం. నేనంటాను, గొడవపడకుండా ఉండే బంధం కన్నా, ఎంత గొడవపడినా తెగిపోని బంధం దొరకడం దేవుడిచ్చే వరం. ఈ బంధం సమాధానమును గూర్చిన మన ఆలోచనల్లో ఉంటుంది... క్షమాపణ కలిగిన మన గుణంలో ఉంటుంది. విశ్వాసికి ఇది అత్యంత అవసరం.

కొన్ని సార్లు బాధ లేదా మౌనం మన సంబంధాల్లోకి చొచ్చుకొని వచ్చినప్పుడు, వాటిని బాగు చేసుకోవడం మన చేతుల్లో లేదనిపిస్తుంది. అపో. పౌలు తాను బంధకాల్లో ఉన్నప్పటికీ సంఘంలోని విశ్వాసుల ఐక్యతను గూర్చి ప్రోత్శాహిస్తూ ఎఫేసి సంఘానికి ఇలా వ్రాశాడు (ఎఫేసి 4:1) “కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను”

మన సంబంధాల్లో స్వస్థతను వెదుకుతున్నప్పుడు దీర్ఘశాంతము, సంపూర్ణవినయము, సాత్వీకమును ధరించుకొని నడుచుకోవడానికి దేవుని సమాధానమను బంధము చేత ఆత్మకలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఐక్యంగా ఉండాలనేదే ప్రభవు యొక్క ఉద్దేశము. విశ్వాసుల మధ్య ఇక్యతనే సంబంధం బలపడినప్పుడే ఆ కుటుంబాల కుటుంబమైన సంఘంపై క్రీస్తు శిరస్సై యుంటాడు. ఇట్టి సమాధానం కలిగిన బంధాన్ని కలిగియుండుటకు ప్రయత్నిద్దామా?