ఆదరణ వలన పొందే విజయోత్సవాలు

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation - విజయోత్సవములు

ఆదరణ వలన పొందే విజయోత్సవాలు

https://youtu.be/KUJp8rgV1t0

ఆయన తన ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన వెలలేని ఆస్తిగా భావిస్తున్న మనలను అగాధలోయల్లాంటి శ్రమల్లో, శోధనల్లో విడిచిపెట్టేసి కునికేవాడు ఎంత మాత్రమూ కాదు. మనల్ని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఏదో ఒక సమయంలో వారికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శక్తి లేకనో, శక్తి చాలకనో చివరకు వదిలిపెట్టేయ్యవచ్చు. ఎవరైనా మనల్ని ప్రేమతో ఆదరిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. మనం మోస్తున్న ఈ శ్రమ కాస్త తెలికైతే చాలనే అద్భుతాలు కోరుకుంటాం. నిరాశ నిస్పృహ నిన్ను కుదిపెస్తుందేమో; కానీ, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ చేయి ఎన్నడునూ విడువడు, ఎడబాయాడని వాగ్దానం చేస్తున్నాడు. మనలను రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తమేమీ కురచకాలేదని జ్ఞాపకము చేసుకుందాం.

రెండు వేల సంవత్సరాల క్రితం మనల్ని మన పాప, శాపాల నుండి విడిపించి శాశ్వత జీవాన్ని ఇచ్చేందుకు, తన మహిమ సింహసనాన్నీ, పరలోకాన్ని విడిచి దీనుడై ఈ లోకంలో జన్మించి మన శిక్షనంతా తానే మోసి తన ప్రాణాన్ని చివరి రక్త బిందువు వరకు పెట్టేసాడు - మనల్ని నా కుమారుడా.. నా కుమార్తే అంటూ దినమెల్ల మన వైపు చేతులు చాపి యుంచాడు.

శ్రమల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నవేమో, నీ ఒంటరితనాన్ని దూరంగా వదిలేసి నీ కొరకై చాపుతున్న మన తండ్రి హస్తాన్ని పట్టుకోడానికి ప్రయత్నించిచూడు, క్రీస్తుతో నీ అనుభవం మరింత రెట్టింపు అవుతుంది. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మన తండ్రి హస్తాన్ని పట్టుకొని మరోసారి ప్రయత్నించి చూడు విజయాన్ని రుచిచూస్తావు. భయపడకుము, దిగులుపడకుము అని వాగ్దానం చేస్తున్న మన తండ్రి హస్తం అనుదినం ఆదుకుంటున్న మన జీవితాల్లో ఎల్లప్పుడూ విజయోత్సవమే. ఆమెన్.

యెషయా 41:10. ...భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.