జయ విజయం - క్రీస్తు జననం!

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation - విజయోత్సవములు

జయ విజయం - క్రీస్తు జననం

“ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11

2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గణముళ చేత ప్రకటింపబడిన ఆనాటి సుమధుర సువార్తమానము నేటికిని విశ్వమంతటిలో తన భక్తుల ద్వారా ప్రకటింపబడుతూనే ఉంది. ఇంతకీ ఏమిటా సువార్తమానం? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, రిక్తునిగా జేసుకొని, నరావతారిగా ఈ లోకంలో జన్మించి పాపులైన ప్రతి మానవుని వారి పాపములనుండి రక్షించి, నరక బాధ నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని దయచేస్తాడన్నదే ఆ సువార్తమానం.

నేను పాపిని కాదు గదా! నాకు రక్షణ అవసరం ఏమొచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. రక్షణ ఎందుకు అవరసరం అయ్యింది అనగా! దేవుని చేత పవిత్రంగా సృష్టింపబడిన ఆదిమానవులగు హవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఫలితంగా పాపులకై నరక పాత్రులయ్యారు. దేవుని ఉగ్రతకు గురియై దేవుని పవిత్ర సహవాసాన్ని, సన్నిధిని పోగొట్టుకున్నారు. వారి ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అనగా “ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము అందరికి సంప్రాప్తమాయెను” అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బయలు పరుస్తూ వుంది. (రోమా 5:12)

అంతేకాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని, ఏ బేధమును లేదు అందరూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని వివరిస్తూ ఉంది. (రోమా 3:10,23) పాపమునకు వచ్చు జీతం మరణం. ఈ మరణం నిత్యనరకానికి నడిపిస్తుంది. (అపో.కా 4:12) పాపులను రక్షించుటకు జన్మించిన “రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11) అను ఈ సువార్తమానము సిలువలో కార్యరూపము దాల్చింది. క్రీస్తు యేసు పాపముల నిమిత్తమై సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి, మరణించి, పాతిపెట్టబడి, మరణమును జయించి, మూడవనాడు సమాధినుండి మృత్యుంజయుడై తిరిగి లేచి మనకు రక్షణనిచ్చి మనందరి కొరకై తండ్రితో నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంతటి గొప్ప రక్షకుడు జన్మించిన దినమే క్రిస్మస్.

అయితే క్రీస్తును రక్షకునిగా అంగీకరించే విధమేమనగా…“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల అయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక అయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రలనుగా చేయును “ (1యోహాను 1:9) మరియు “ప్రభువైన యేసునందు విస్వసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ పర్వదినం మీ జీవితంలో నిజమైన రక్షణ దినం కావాలని శాంతి సమాధానములను, ఆశీర్వాదములను బహుమెండుగా క్రీస్తు ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ ..... హ్యాపీ క్రిస్మస్.