దేవునితో నడిస్తే విజయోత్సవాలే

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation - విజయోత్సవములు

దేవునితో నడిస్తే విజయోత్సవాలే

https://youtu.be/SpkvIzIAijA

ఒక విశ్వాసి ప్రతి రోజు ఉదయం దేవునితో తన సమయాన్ని గడుపుతూ సముద్ర తీరాన నడుస్తూ ఉండేవాడు. అతడు నడుస్తూ ఉన్నప్పుడు తన అడుగుల ప్రక్కనే మరో అడుగులు కూడా గమనించాడు. దేవుడు తనతో నడుస్తున్నాడనే తన హృదయం సంతోషంతో పులకించిపోయేది. అయితే రోజులు గడుస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో తనకు కొన్ని ఒడుదుడుకులు ఎదురైనప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ తన జీవితంలో కలిగినప్పుడు తాను నడిచే దారిలో, తన అడుగులు మాత్రమే ఉండడం గమనించాడు. ఏంటీ, నేను సంతోషంగా ఉన్న రోజుల్లో దేవుడు నా ప్రక్కనే నడిచాడు, నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని సందేహంలో ఉండిపోయాడు.

ప్రభువా, ఎందుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? అని ప్రభువును ప్రశ్నించాడు. అందకు ప్రభువు ఇచిన సమాధానం – “నా స్నేహితుడా, నీకు సంతోషం కలిగినప్పుడు నీతో నడిచినమాట వాస్తవమే. అయితే, నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను నేను ఎత్తుకొని నేను నడిచాను, నీకు కనబడే ఆ అడుగులు నీవి కాదు అవి నావి” అంటూ సమాధానం ఇచ్చాడు ప్రభువు.

గడచిన దినములలో శ్రమలగుండా దేవుడు నిన్ను నడిపించి యుండవచ్చు అయితే ప్రతి శ్రమలో, ప్రతి కష్ట సమయాల్లో దేవుడు నిన్ను ఎత్తుకొని భద్రపరచాడు కాబట్టే ఈరోజు సజీవుల లెక్కలో ఉంటూ తన వాగ్దానాలను తన ఉద్దేశాలను నీ జీవితంలో నేరవేర్చుకుంటున్నాడు. శ్రమ కలిగినప్పుడు, దేవుడు శ్రమను తీసివేయడు కాని, మనలను తన హస్తాల్లో భద్రపరుస్తూ, ఆ శ్రమలగుండా నడిపిస్తూ వాటిని అధిగమించే గొప్ప అనుభవాన్ని మనకు నేర్పించేవాడుగా ఉంటాడు.

యెషయా 43:2 లో “నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలోబడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు”. ఈ అనుభవంలో ఆయనపై మన విశ్వాసం రెట్టింపై తన వాగ్దానాలను తన ఉద్దేశాలను తెలుసుకోవాలనేదే మన పరలోకపు తండ్రి ఉద్దేశం. ఆమెన్.