తీసుకున్న తీర్మానం ఫలించాలంటే?

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

తీసుకున్న తీర్మానం ఫలించాలంటే?

Audio: https://youtu.be/QqNXyrQmp74

నూతన సంవత్సరంలో ఏదైనా క్రొత్త తీర్మానం తీసుకున్నారా? బహుశ బైబిల్ మొత్తం చదివేయాలనో, దేవునితో ఇంకొంచం లోతైన సహవాసం కలిగి యుండాలనో, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండ దేవుని సన్నిధికి వెళ్లాలనో, ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రార్ధనలో గడపాలనో లేదా సువార్త ప్రకటించి దేవుని వైపు నడిపించాలనో…ఇలా ఎన్నో మన ఆత్మీయ స్థితిని బలపరిచే తీర్మానాలు మీరు తీసుకొని యుండవచ్చు. అంతేకాదు కొన్ని వ్యక్తిగత తీర్మానాలు కూడా ఉంటాయి; బరువు తగ్గలనో, ఉదయాన్నే కాస్త వ్యాయామం చేయాలనో, క్రొత్త ఉద్యోగం లేదా లాభాలు తెచ్చిపెట్టే మంచి వ్యాపారం కోసం ప్రయత్నించాలనో లేదా ఉన్నత చదువులు…ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఈ తీర్మానాలు క్రమం తప్పకుండా ఆఖరి నెల వరకు పాటించాలి, అప్పుడే కదా తీసుకున్న తీర్మానానికి మనం జవాబుదారి.

వారం మొదట్లో లేదా నెల గడిచేసరికి ఈ తీర్మానంలో కాస్త విశ్రాంతి తీసుకున్నామా సరే, అంతే సంగతులు! మన నిర్ణయం బూజు పట్టిపోతుంది చివరకు మరో నూతన సంవత్సరం కోసం ఎదురు చూడాల్సిందే. సాధించలేను! ఈ తీర్మానాలు నేను నెరవేర్చలేను అని తనకు తానే అనుకుంటూ… “అసలు ఏ తీర్మానం లేకుండా హాయిగా సాఫీగా ఉండడమే ఈ నూతన సంవత్సర తీర్మానం” అనుకునే వారితో ఎటువంటి ప్రయోజనం లేదు. దేవునుకి కుడా వారితో అవసరం అసలే లేదు.  

ప్రియ చదువరి, నూతన సంవత్సరం అనే కాకుండా జీవితంలో తీర్మానం కలిగియుండడం ఎంతో ప్రాముఖ్యమైనది. అది మన ఆలోచనలను, మన తలాంతులను, మన జ్ఞానాన్ని మెరుగుపరుస్తూ మనలను దేవుని ఆశీర్వాదాలకు కారకులను చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సంసిద్ధులను చేస్తుంది. దేవుడు కూడా చూసేది మన అంతరంగంలోని తీర్మానాలే అవి ఆత్మీయ సంగతులైనా లేదా దైనందిన మన వ్యక్తిగత జీవితమైనా!. జ్ఞానియైన సోలోమోను అంటున్నాడు సామెతలు 6:6 లో “సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.” మనము సోమరులము కాకుండా ఉండకుండా చూచుకొందము.

నా వ్యక్తిగత అనుభవంలో  నేను నేర్చుకున్న సంగతి మీకు తెలియజేస్తాను. ఒక తీర్మానం అది ఆత్మీయమైనా వ్యక్తిగతమైనా క్రమం తప్పకుండా జరగాలంటే ఈ ప్రక్రియను గమనించండి. ఒక పుస్తకంలో మీ తీర్మానాన్ని వ్రాసుకోండి. ఎప్పుడైతే క్రమం తప్పలేదు అనుకుంటే పక్కనే “tick mark” కొట్టండి, లేదంటే “X mark” కొట్టండి. ప్రతి నెల ఆఖరిలో ఎన్ని సార్లు చేయగలిగామో ప్రోత్సాహం పొందండి. చేయాలేకపోయామనే మీ సంఖ్య తగ్గేలా వచ్చే నెలలో మీకు మీరే ఛాలెంజ్ చేసుకోండి. ప్రయత్నించి చూడండి!.ఆఖరి నెలలో మీకు మీరే విజేతలు, ఎందుకంటే మిమ్మల్ని మీరే గెలుచుకుంటారు.  పోరాడి గెలిచిన వారికే కదా అనుభవాలు విజయాలు. మరి మీరెందుకు ఓడిపోవాలి? విజయపధం వైపు నడిపించుటకు దేవుడు మీకు సహాయం చేయును గాక. ఆమేన్.

నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తన 20:4