మంచి వ్యక్తిగా జీవించడం అంటే?

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

మంచి వ్యక్తిగా జీవించడం అంటే?

దేవుని తృప్తిపరచే ఒక మంచి కుటుంబం అంటే ఏంటి? అనే ప్రశ్న నా స్నేహితురాలిని అడిగాను. తానిచ్చిన సమాధానం - కలిసి మెలిసి ఉండడం, తలిదండ్రులకు విధేయులుగా ఉండడం, అందరితో నిజాయితీగా లేదా అబద్ధమాడకుండా జీవించడం. అంతేకాదు, కనీసం క్రిస్మస్ లేదా ఈస్టర్ కైనా దేవుని గుడికి వెళ్లి ప్రార్ధన చేసుకొని రావడం. మంచి నడవడి కలిగిన కుటుంబానికి నిర్వచనం వివరించిన తన సమాధానంతో ఆశ్చర్యం కలిగిన నేను మరో ప్రశ్న అడిగాను. కుటుంబం గూర్చి అన్నీ బానే ఉన్నాయి; కాని పండగ క్రైస్తవుల్లా సంవత్సరానికి ఒక్క సారే దేవుని మందిరానికి వెళితే సరిపోతుందా అది దేవుని తృప్తిపరచినట్టేనా? అని అడిగినప్పుడు… తడబడకుండా తానిచ్చిన సమాధానం – దేవుని దృష్టిలో మంచిగా జీవిస్తే చాలు దేవుని తృప్తిపరిచినట్టే కదా!

ప్రియమైన వారలారా, సంస్కృతిలో సంబంధం లేకుండా మంచి వ్యక్తిలా జీవించడమే దేవుడు కోరుకునేదని మనలో అనేకులం అనుకుంటూ ఉంటాం. పాశ్చ్యాత్య దేశాల్లోనే కాదు, నేడు మన దేశంలో కూడా… ఏడాదికి ఒకసారి, లేదా ఎదో మనకు కుదిరినప్పుడు, మంచి జరిగినప్పుడు, లేదా పండగలకు మాత్రమే దేవుని మందిరానికి వెళ్లి వస్తే అంతకంటే ఇంకేం కావాలి అనుకే వారు మనలో ఎంతో మంది ఉన్నారు. దేవుని మందిరంలో కాసేపు సమయం గడిపి దర్శించుకొని వస్తే దేవుణ్ణి తృప్తిపరచినట్టేనని అనుకునే వారు ఎందరో. చాలామందికి మంచి వ్యక్తిగా ఉండడం అనే మాటకు నిర్వచనం ఇదే.

అపో. పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖను వ్రాస్తూ 3వ అధ్యాయంలో తన సంస్కృతిలో మంచిగా ఉండడం అంటే ఏమిటో స్పష్టంగా వివరించాడు. పౌలు, మూడవ శతాభ్దానికి చెందిన భక్తిగలిగిన యూదుడైనందున తన సంస్కృతికి చెందిన నైతికతను అక్షరాలా అనుసరించాడు. అతడు సరైన కుటుంబంలో జన్మించాడు, సరైన విధ్యాభ్యాసాన్ని పొందాడు. సరైన మతాన్ని అనుసరించాడు. యూదుల సాంప్రదాయాన్ని అనుసరించిన మంచి వ్యక్తి అనడానికి నిదర్శనం అతడు. అంతే కాదు, అతడు తలంచితే తనకున్న మంచితనాన్ని బట్టి అతడు గొప్పగా చెప్పుకోవచ్చు అంటాడు. అయితే, అతడు ఎంత మంచివాడైనప్పటికీ, మంచిగా ఉండడానికి మించింది ఒకటున్నదని ఆనాడు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ నేడు మనకును జ్ఞాపకం చేస్తున్నాడు. మంచితనము కలిగి యుంటూ మంచిగా ప్రవర్తిస్తే అది దేవుని తృప్తిపరచడము కాదని హెచ్చరిస్తున్నాడు.

దేవుని తృప్తిపరచడం అంటే యేసు క్రీస్తును ఎరగడము అని అంటాడు అపో.పౌలు (ఫిలిప్పీ 3:7-8). “ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము” ను ఎరుగుటతో పోల్చినప్పుడు తన మంచితనమును “పెంటతో” సమానంగా ఎంచుకున్నాడు పౌలు. మన నిరీక్షణ, విశ్వాసము, మన మంచితనములో గాక కేవలము క్రీస్తులోనే ఉన్నప్పుడే మనం మంచివారము; అప్పుడే దేవుని తృప్తిపరచేవారమవుతాము. వ్యక్తిగతంగా మనం మంచివారం అనుకుంటూ చీకటిలో బ్రదుకుతున్నాం. దేవునికే ప్రాధాన్యతనిస్తు క్రమం తప్పకుండా ఉండగలిగే క్రీస్తుతో మన సహవాసం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపిస్తుంది. ఆమెన్.

https://youtu.be/I29W6BVWvBo