విశ్రాంతికి ఒక రోజు

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

విశ్రాంతికి ఒక రోజు

https://youtu.be/Tzf_bs8rKBw

ప్రతి రొజు ఎదో ఒక పనిలో ప్రయాసపడుతూ ఉంటాము. ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా చదువులో మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతము. వారంలో ఒకరోజు లేదా సంవత్సరంలో కొన్ని రోజులు మనకు సెలవలు ఉంటాయి. సెలవలు ఉన్న సందర్భాల్లో కాస్త విశ్రమించే ఆలోచన ఎంత బాగుంటుది కదా. నేనైతే కుటుంబసభ్యులతో మరియు స్నేహితులతో సమయం గడుపుతూ ఉంటాను. కొన్నిసార్లు, ప్రకృతిని ఆశ్వాదిస్తూ… నీటి ఒరవడిని, పక్షుల కిలకిలారావాలను వింటూ సేదదీరుతూ ఉన్నప్పుడు నన్ను ఒక విషయం గుర్తుచేసింది. మన ప్రాణాలు విశ్రమించడానికి దేవుడు తోడ్పడుతున్న దానిని బట్టి కొంతసేపు ఆగి ప్రభువుకు కృతఙ్ఞతలు చెల్లించాను.

ప్రాచీన మధ్య ప్రాచ్యములోని ప్రజలు వర్ధిల్లాలని ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి, సబ్బాతు లేదా విశ్రాంతి దినమును అంటే విశ్రాంతికి, పునరుజ్జీవించడానికి సమయాన్ని నియమించాడు. నిర్గమకాండము లో మనం గమనించినట్లయితే (నిర్గమ 23:12) “ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను”. ఆరు సంవత్సారాలపాటు పంటలు వేసికోమని, ఏడవ సంవత్సరమున విశ్రమించమని యెహోవా దేవుడు చెప్పాడు. అలాగే పని విషయంలో కూడా ఆరు రోజులు పని చేసి ఏడవ రోజున విశ్రమించాలి. ఈ జీవన విధానాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పుట ద్వారా మిగిలిన దేశాలనుండి ప్రత్యేకించబడ్డారు. ఎందుకంటే వారు మాత్రమే గాక వారి ఇంటిలోనున్న పరదేశులు, బానిసలైనవారు కూడా ఈ పద్ధతినే అవలంబించడానికి అనుమతించబడ్డారు.

నేనంటాను… మన ఇష్టాలకు తగినట్టు, మన ప్రాణాలను పోషించే దేనినైనా చేయడానికి, ఆరాధించడానికి ఒక అవకాశాన్ని స్వాగతిస్తూ, ఆశతో, సృజనాత్మకతతో, విశ్రాంతి దినము కొరకు మనము ఎదురు చూడవచ్చు. కొందరికి ఆటలాడడం అంటే ఎంతో ఇష్టం, మరి కొందరికి తోట పని చేయడం అంటే ఇష్టం, ఇంకొందరు స్నేహితులతో కలిసి సమయం గడపడం, కొందరికి కుటుంబసభ్యులకు వండిపెట్టడమంటే ఇష్టం, మరి కొందరికి మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడమంటే చాలా ఇష్టం.

ఒకవేళ అదే మన జీవితాల్లో లోపిస్తున్నట్లయితే, ఒకరోజును విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకపరచుకోవడం వలన కలిగే మాధుర్యాన్ని, సమృద్ధిని ఎలా తిరిగి కనుగొనగలము?. మన విశ్వాసములో, సేవలో పని ఎంత ప్రాముఖ్యమైనదో విశ్రాంతి కూడా అంతే ప్రాముఖ్యమైనదని ప్రభవు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఆమెన్.