సిలువ ధ్యానాలు - Day 3 - సిలువ సమర్పణ
Audio: https://youtu.be/wIejdagMFk4
మనపట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పగావుందో రుజువు కావాలంటే, మన పాపముల కొరకు దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తును అర్పించిన ఆ సిలువను మొదట చూడాలి. కల్వరి అనేది దేవుడు మనపైన కలిగియున్న సంపూర్ణమైన, తిరస్కరించలేని, వెలకట్టలేని ప్రేమకు రుజువు.
యెషయా 53:10 ... అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
అతని సంతానము చూస్తువుండగా తన్నుతానే అపరాధపరిహారార్థబలిగా చేయబడెనని వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన కాలములోవున్న ఈ అపరాధపరిహారార్థబలిని గమనిస్తే యేసు ప్రభువు చేసిన బలియాగం అర్ధము చేసుకోగలము.
లేవి 5:17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేనినైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును.
18 కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
ఇశ్రాయేలీయులు పశువుల కాపరులు. ప్రతి యింటిలో పశువులు ఉంటాయి. పాత నిబంధన కాలములో ఎవరైన తెలిసి తెలియక పాపం చేసినప్పుడు దానికి పరిహారముగా పశువును బలిచ్చేవారు. ఎక్కువశాతం పశువు కొరకు మార్కెట్ వెళ్ళి కొనవలసిన అవసరం లేదు వారి మందలో నుండే పశువును తీసుకొచ్చేవారు. వారు చేసిన పాపమునకు క్షమాపణ కలుగవలెనంటే ఆ పశువు తలపైన చేయి పెట్టినప్పుడు తాను చేసిన పాపమంత ఆ పశువు మీద మోపబడుతుంది, యాజకుడు పశువును బలిచ్చి ప్రాయశ్చిత్తం చేసేవాడు.
దీనంతటిలో బిలియైన పశువును గమనిస్తే, పాపము చేసిన ఆ మనిషి స్థానములో చనిపోయిన ఆ గొఱ్ఱెపిల్ల లేదా పొట్టేలు జన్మించినప్పుడు ఈ పాపము చేసిన మనిషి అక్కడేవుండివుండొచ్చు. అది చిన్నగావున్నప్పుడు లేత కొమ్మలు తీసుకొని వచ్చి దానికి తినిపించివుండొచ్చు. అది నడవలేనప్పుడు భుజము మీద ఎక్కించుకొని యింటికి తీసుకొని వచ్చివుండొచ్చు. తన యజమాని ఇన్ని సేవలు చేసి తన పట్ల ప్రేమను చూపిస్తుంటే ఈ చిన్న గొఱ్ఱెపిల్ల తన కుంటుంబములో వ్యక్తిగా కలిసిపొయి, తన యజమాని ఎప్పుడు పిలుస్తే అప్పుడు పరుగెత్తుకుంటు వచ్చేది.
ఒకరోజు తన యజమాని దేవాలయమునకు తీసుకొని వెల్తుంటే తన వెనకే వెళ్ళింది చిన్నప్పిటి నుండి తన చేతిలో పెరిగిన గొఱ్ఱెపిల్ల. యజమాని తన తల మీద చెయ్యి పెడుతుంటే, నా యజమానికి నేనంటే ఎంత ఇష్టమోనని మురిసిపొయుంది ఈ అమాయకపు పశువు. ఎప్పుడైతే యాజకుడు కత్తితీసి గొంతు మీద పెట్టాడో అప్పుడర్ధమైనది ఈ ప్రేమంత నా మీద కాదు తాను చేసిన పాపం నుండి తనను తాను విడిపించుకొనుట కొరకేనని. ఎమి చెయ్యలేక నిస్సహాయంగా కన్ను మూసింది ఆ అమాయక పశువు.
యెషయా 53:2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
యేసు ప్రభువు లేతమొక్కవలె అపురూపంగా దేవుని యెదుట పెరిగి ఎండిన భూమిని పోలిన, నిస్సారమైన జీవితము కలిగిన ప్రజల కొరకు ఆ కల్వరి సిలువలో అపరాధపరిహారార్థబలిగా చేయబడి సురూపమును, సొగసును కొల్పోయి ఎవరు చూడలేని రక్తపు ముద్దగా వ్రేలాడెను.
మానవాళి పాపపు స్థితిని యేసయ్య చూసినప్పుడు, ఆ పాపమునకు కలిగే శిక్షను చూసినప్పుడు తన సురూపము సొగసు గురించి ఆలోచించకుండ నీ నా రక్షణ కొరకు ఆ కల్వరి సిలువలో ఆ మండుటెండలో బలియైపోయి మనకు ఉచ్చితముగ రక్షణ అనుగ్రహించాడు. మన విమోచన, ఆనందం కొరకు తనను తానే మరణమునకు సమర్పించుకున్నాడు. ఇంతగొప్ప సమర్పణ సిలువలో యేసయ్య నీ కొరకు చేసియుండగ నీవు ఆయన కొరకు ఏమి సమర్పించగలవు? లోకములోని ఆనందాల కోరకు కాకుండ ప్రార్ధన వాక్యం కొరకు సమయం సమర్పించగలవా? దేవుడు నీ జీవితములో చేసిన మేలులను, సువార్తను ప్రచురించుటకు నీ పెదవులను సమర్పించగలవా? అనేకమైన చెడు తలంపులతో నీ హృదయము నింపకుండా పరిశుద్ధమైన హృదయమును దేవునికి సమర్పించగలవా? నీవు లేకుండ నేను బ్రతకలేనని మనుష్యులతో కాకుండ, నీవు లేకపోతే నా జీవితమే శూన్యమని యేసయ్యకు నీ జీవితం సమర్పించగలవా? ఏమి చేసి ఈ దినం దేవుని సంతోషపెట్టగలవు?