సిలువ ధ్యానాలు - Day 7 - సిలువ సహించుట:
Audio: https://youtu.be/u-0YSwJE5_c
తప్పిపోయున కుమారుడు తప్పు తెలసుకొని తిరిగి వచ్చినందుకు తోడపుట్టిన సహోదరుడు అంగీకరించలేకపోయాడు. ఒక్కసారిగా ఆ సహోదరునిలో అనేకమైన ఆలోచనలు మొదలైయ్యాయి. వాడి ఆస్తి చేతికిరాగానే మమ్ములను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు దిక్కులేక మళ్ళి వచ్చాడు. వీడు ఇంత చేసినా తండ్రి ప్రేమిస్తున్నాడంటే; ఇప్పుడు వీడిని అంగీకరిస్తే మరల ఆస్తిలో భాగం ఇవ్వవలసి వస్తుందేమో. ఇలా అనేకమైన ఆలోచనలతో కోపంతో ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్న సహోదరుడు.
తండ్రి దగ్గర ఇంట ఉన్న సహోదరుడు మాట్లాడే విధానంలో తప్పులేకపోవచ్చు కాని, స్వార్ధం ఉంది కాని, తండ్రి ప్రేమలో సహనం ఉంది. తప్పిపోయి తిరిగి వస్తున్న కుమారుడు దూరముగ ఉన్నప్పుడే తండ్రి చూసి గుర్తుపట్టి ఎదురువెళ్ళాడంటే, తండ్రిలో ఉన్న ఆ ఎదురుచూపులను అర్ధం చేసుకొవచ్చు. ఆస్తంత తీసుకొని వాడు వెళ్ళిపోయాడు కాని, తండ్రి వాడు వెళ్ళిన దగ్గర నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు తిరిగి రాగానే లావాదేవీల గురించో లేదా వాడు చేసిన తప్పు గురించి మాట్లాడలేదు కాని, వాడితో కలిసి సంతోషిస్తున్నాడు. తండ్రిలో ఆ సంతోషానికి కారణం, తండ్రి ఆశించిన మార్పు కుమారునిలో కనిపించింది. తండ్రికి కావలసినది ఆస్తి కాదు మార్పు అందుకే తప్పిపోయిన కుమారుని కొరకు సహించాడు, వాడి బలహీనతలను భరించాడు.
యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను.
బాగుచేయడం వేరు భరించడం వేరు. యేసు ప్రభువు రోగములను బాగుచేయడమే కాదు నీకున్న బాధలను, నీకున్న బలహీనతలను అవి నేను భరిస్తానని చెప్తున్నాడు. సహాయం చేసేవారు తిరిగి సహాయం కోరే అవకాశం ఉంది. ఒకసారి సహాయం చేసినవారు మరలా సహాయం చేసే అవకాశాలు తక్కువ కాని, ఈ రోజులలో సహాయం చేసేవారు కాదు నీ పరిస్థితులను అర్ధం చేసుకొని నిన్ను భరించేవారు కావాలి. ఈ లోకములో భరించేవాడు ఒక్కడే ఉన్నాడు ఆయనే యేసు ప్రభువు.
గెలవాలనే ఆశ ఉన్నవారిలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం సహనం. విజయమెప్పుడు తొందరగా రాదు, మంచి జరగాలంటే ఎదురుచూడవలసినదే.
25 సం।।లు అబ్రహామే కాదు 25 సం।।లు దేవుడు కూడా ఎదురు చూసాడు. 25 సం।।లు అబ్రహాము సంతానం కొరకు ఎదురు చూసాడు. దేవుడు తలచుకుంటే వాగ్ధాన భూమిలో అడుగు పెట్టిన సంనత్సరమే అబ్రహాముకు కుమారుని అనుగ్రహించేవాడు కాని, దేవునికి సంతానమివ్వడమే కాదు అబ్రహాము పరిపూర్ణమైన విశ్వాసం కలిగివుండాలి, దేవుడు అనుకున్న స్థితికి అబ్రహాము రావాలి. విశ్వాస జీవితములో ఏదైన కొరత ఉన్నదంటే అది శిక్ష కాదు లేదా సాతాను వలన కలిగే శోధన కానేకాదు; అది విశ్వాసులను పరిపూర్ణ స్థితికి తీసుకొని రావాడానికి దేవుడు వాడే పద్దతి. అబ్రహామునకు ముందే ఇస్సాకును ఇచ్చివుంటే విశ్వాసములో పరిపూర్ణ స్థితికి వచ్చేవాడు కాదు.
సిలువ అంటే భరించుట. ఇన్ని కష్టాలు ఎలా భరించాలని వేదన పడుతున్నావా? యేసునందు విశ్వాసముంచే వారి బాధలన్ని యేసయ్య భరిస్తున్నాడని మరచిపోవద్దు. నీ సమస్యల నుండి, నీ బాధల నుండి బయటకు ఎలా రావాలని ఆలోచించడం కాదు, నీ ప్రతికూల పరిస్థితులలో దేవుడు నీలో ఏ మార్పు కోరుతున్నాడో ఆ మార్పులోనికి రావాలి. నీ సమస్యలు, నీ బాధలు భరించి నిన్ను విడుపించుటకు యేసు ప్రభువు సిద్దముగా ఉన్నాడు. సమస్యలలో సహనము కలిగియుండి నీలో దేవుడు ఆశించిన మార్పును నీవు తీసుకొనిరాగలవా?