సిలువ ధ్యానాలు - Day 11- సిలువ ఓర్పు
Audio: https://youtu.be/BP7fHIAjCFo
సాధారణముగ మనుష్యులలో లేనిది ఓర్పు. కొంతమంది ఎంత ఓర్పు కలిగివున్నా ఒకానొక సమయంలో ఓర్పును కొల్పోతారు, పరిస్థితులు అలా మార్చేస్తాయి. ఓర్పును కోల్పోతే కలిగేది నష్టమే కాని, లాభం కాదు. హేబెలు అర్పణ అంగీకరించబడినప్పుడు కయీను కోపానికి కారణం ఓర్పును కొల్పోవడమే; ఆ కోపంతోనే తమ్ముడిని చంపేసాడు. ఓర్పు లేకపోవుటవలననే సంమ్సోను ఒక వేశ్య మాటలకు విసిగిపోయు బంధించబడ్డాడు. ఓర్పు లేకపోవుటవలననే సౌలు రాజు యాజకుడు చేయవలసిన బలిని తానే చేసి దేవుని చేత తృణీకరించబడ్డాడు.
అందుకనే ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులను పడగొట్టుటకు దుష్టుడు ఎక్కువగా వాడే పద్దతి కూడా అదే, సమస్యలలో నీవు నలిగిపోతున్నప్పుడు నీలోని ఓర్పు, నిరీక్షణను పుట్టించకముందే నీలోని ఓర్పును దొంగిలిస్తాడు. జాగ్రత్తగ గమనిస్తే సమస్యలు ఎప్పుడు ఒంటరిగా రావు గుంపులుగ వస్తాయి. సమస్య వెంబడి సమస్యలు వస్తాయి. నీవు నీ ఉద్యోగములో ఏదైన టెన్షన్ లో ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళు తొందరపెడతారు. నీకు ఆరోగ్యం బాగోలెనప్పుడే నీతో ఎవరు ఉండరు. నీవు సమస్యలలో ప్రార్ధన చేయాలనుకున్నప్పుడే నీవాళ్ళతో వాదనలు జరుగుతాయి. ఇంట్లో వారు సాతాను సంబంధులని నేను చెప్పడంలేదు కాని, దుష్టుడు నీలోని ఓర్పును ఎలా దొంగిలిస్తాడో చెప్తున్న. విశ్వాసి సమస్యలలో ఓర్పు కలిగివున్నప్పుడే అద్భుత కార్యములను చూస్తాడు కాని, దుష్టుడు నీవు అద్భుత కార్యములను చూడక ముందే నీలోని ఓర్పును దొంగిలిస్తానికి నానారకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.
హెబ్రీ 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది. అనగా నీవు దేవుని పని ముంగించినదానికి, నీకు వాగ్ధానం చేయబడినది పొందుకోవడానికి మధ్యలో ఓర్పు ఉంది. ఓర్పు వలననే నీవు దేవుని కార్యములు చూడగలవు. ప్రార్ధన చేసి జవాబు వచ్చే వరకు ఓర్పుతో ఎదురు చూడాలి కాని, చాలామంది ఓర్పు లేక దేవుని మీద సణిగుట వలన దేవుని కార్యములను చూడలేకపోతున్నారు.
యెషయా 53:7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. యేసు ప్రభువు తనను వెంబడించిన శిష్యుడు ప్రధాన యాజకులతోను, పెద్దలతోను చేతులు కలిపాడని తెలసిన నోరు తెరువలేదు. అన్యాయముగ నిందించబడుతున్నప్పుడు నోరు తెరువలేదు. అన్యాయమైన తీర్పు తీర్చినప్పుడు నోరు తెరువలేదు. కాళ్ళకి, చేతులకు మేకులు కొడుతున్నప్పుడు నన్నెందుకు హింస్తున్నారని అనకుండా క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆయన ప్రక్కన ఉన్న దొంగ; నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనమన్నప్పుడు, యేసు ప్రభువు నా పరిస్థితే బాగోలేదు ఈ మేకుల నొప్పి భరించలేకపోతున్నానని అనలేదు కాని, ఆ పరిస్థితిలో కూడు ఆ దొంగ ప్రార్ధనకు ఓర్పుతో జవాబు ఇచ్చాడు. సిలువలో యేసు ప్రభువు మరణ సమయములోనే ప్రార్ధనకు జవాబిచ్చాడంటే, మరణమును జయించి పరలోకములో సింహాసనాసీనుడైన యేసు ప్రభువు ఇప్పుడు నీ ప్రార్ధన ఆలకించి జవాబు ఇవ్వలేడా? ఓర్పు కలిగివుంటే 100% నీ ప్రార్ధనకు జవాబు ఇవ్వగలడు, సహాయం చేయగల సమర్ధుడు.
సిలువ అనగా ఓర్పు. ఓర్పు లేకుండ బహుమానం లేదు. అన్యాయముగా నిందించబడుతున్నావా? మౌనముగా ఉండు. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదా? మౌనముగా ఉండు. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావా? మౌనముగా ఉండు. నష్టములో, కష్టములో, బాధలో, ఇరుకు ఇబ్బందులలో మౌనముగా ఉండు. నీవు కేకలు వేయనవసరం లేదు రేపు నీ నీతి మిద్దెల మీద చాటింపబడుతుంది. సీయోనులో మౌనమే దేవునికి స్తుతి చెల్లించినట్లైతే, దేవునియందు విశ్వాసముంచిన నీవు సమస్యలలో సణుగక దేవుడు సహాయము చేయగలడని మౌనముగ ఎదురు చూచుట మంచిదే. వాదనలకంటే మౌనం చాలా భయంకరమైనది. అందుకే నీ సమస్యలు దేవుని చేతిలో పెట్టి, ఓర్పు కలిగి మౌనముగ ఎదురుచూడు, దేవుని కార్యములు నీ జీవితములో తక్కువ చేయబడవు.
SajeevaVahini.com