పరలోక ఆరాధనలు

  • Author: Vijaya Kumar G
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini Oct - Nov 2010 Vol 1 - Issue 1

ఆరాధన అనగానే యోహాను 4:24 గుర్తుకు వస్తుంది. ఆరాధకులు అంటే ఎవరు? ఆరాధన అంటే ఏమిటి? ఆరాధించడం ఎలా? ఇత్యాది ప్రశ్నలన్నిటికి ఒకే ఒక జవాబు యోహాను 4:24.

సమరయ స్త్రీతో యేసుప్రభువు ఆరాధన గురించి క్లుప్తంగాను స్పష్టంగాను వివరించారు.” దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. నోరార చేసేది ప్రార్ధన. కోరికతీర అడిగేది విజ్ఞాపన. మనసార చేసేది ధ్యానం. ధన్యవాదాలు చెప్పేది కృతజ్ఞత. వీటన్నిటికి భిన్నంగా చేసేదే ఆరాధన. ఆరాధనలో రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి దేవాది దేవుని హెచ్చించుట, రెండవది తనను తాను తగ్గించుకొనుట.

దేవుని హెచ్చించు విధానాలు ఉదాహరణకు కొన్ని: ఘనత, మహిమ, బలము, ప్రభావము ఆరోపించుట; కీర్తించుట, పొగడుట, హెచ్చించుట, కొనియాడుట మొదలైనవి. తనను తాను తగ్గించుకోవడం అంటే మానవుడు కేవలం మన్ను అని, ఒక నీటి బుడగ అని, ఒట్టి ఆవిరివంటి వాడు అని: ఇలా తృణప్రాయంగా ఎంచడం. ఆత్మదేవుని ఆత్మతో, ఆత్మలో ఆరాధించడమే ప్రాముఖ్యం. మనలను మనం ఎంత తగ్గించుకున్నా, ఎంత హీనపరచుకున్నా దేవాది దేవునికి చెందవలసిన ఘనతా, మహిమ పరిశుద్ధత ఆరోపించలేకపోతే అది వ్యర్ధమైన ఆరాధనే.

పరలోకంలో జరిగే 12 ఆరాధనలు ప్రకటన గ్రంథంలో పఠించి, గ్రహించి, పాటించి పరలోక ఆశీర్వాదములను పొందుదుము గాక, ఆమేన్!

మొదటి ఆరాధన : ప్రకటన 1:6 “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్.”

భక్తుడైన యోహాను ఆత్మవశుడై యున్నాడు. మొదట మన యెడల దేవుని అపారమైన ప్రేమను, తరువాత మనకు ఉచితముగా ఇచ్చిన పాపక్షమాపణను అనగా పాపమునుండి, శాపమునుండి మనకు విడుదల, విమోచన అనుగ్రహించిన దేవునికి ఇప్పుడును ఎప్పుడును రాబోవు యుగమందును మహిమా ప్రభావములు ఆరోపించుచున్నాడు.

రెండవ ఆరాధన : ప్రకటన 4:8 “ ఈ నాలుగు జీవులలో ప్రతిజీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి – భూతవర్తమాన భవిష్యత్కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పు చుండును.”

సింహాసనాసినుడై యున్న దేవాది దేవుని చుట్టును ఉన్న ఈ నాలుగు జీవులను యెషయా 6వ అధ్యాయంలో కుడా చూడ గలము. అవి కళ్ళు మూసుకుని స్తుతిస్తున్నాయి. కాళ్ళు కప్పుకుని ఘనపరుస్తున్నాయి. రెక్కలతో ఎగురుతూ మహిమపరుస్తున్నాయి. సింహాసనము ఎదుట నిలువలేక, కూర్చుండలేక నిత్యమూ రెండు రెక్కలతో ఎగురుతూనే ఉంటాయి. అట్లు దేవునికి సంపూర్ణ పరిశుద్ధత ఆరోపించడం ఈ ఆరాధనలో గమనించగలం.

మూడవ ఆరాధన : ప్రకటన 4:10,11 “ ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జివించుచున్న వానికి నమస్కారము చేయుచు – ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుదవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట పడవేసిరి.”

ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములనుండి పన్నిద్దరిని మరియు ఎత్తబడిన ఆయా సంఘములలో నుండి ఎన్నుకొనబడిన పన్నిద్దరు అపోస్తలులను పరలోకంలో పెద్దలుగా పిలువబడడం ఇక్కడ గమనించాలి. వారికి ఇరువదినాలుగు సింహాసనములు ఉన్నవి. ప్రతీ ఒక్కరికి కిరీటం ఇవ్వబడింది. వారి వారి సింహాసనములు విడిచి సింహాసనాసీడైయున్న ప్రభువు పాదముల దగ్గర సాగిలపడుతూ వారి కిరిటములను సయితం ఆయన పాదములదగ్గర పెట్టడం గమనించగలం. వారు అయ్యో, ప్రభువా! మేము నీ ఎదుట ఎట్లు కూర్చుండగలము ఎట్లు కిరిటములను ధరించగలము అంటూ సృష్టికర్తకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించడం చూడగలం.

నాలుగవ ఆరాధన : ప్రకటన 5:5 “ ఆ పెద్దలలో ఒకడు – ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.”

6వ వచనంలో వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూస్తూనే 5వ వచనంలో యేసు ప్రభువును దావీదుకు చిగురుగాను యూదా గోత్రానికి సింహముగాను హెచ్చిస్తున్నాడు. ఆ గ్రంథం విప్పడానికి ఆయన పొందిన సిలువ శ్రమల్ని పునఃరుర్ధాన విజయాన్ని స్మరిస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకు “యోగ్యుడు” అని పేరు.

అయిదవ ఆరాధన : ప్రకటన 5:12 “ వారు – వధింపబడిన గొఱ్ఱెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.”

సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియున్న లెక్కింపజాలని కోట్లకొలది దేవదూతల ఆరాధన అది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు మాత్రమే “యోగ్యుడు” అని ఆ పెద్దలలో ఒకడు ప్రకటించగానే పరలోకమంతా సందడిగా మారిపోయింది. అక్కడ ఒక క్రొత్త కీర్తన వినిపిస్తూవుంది. కోట్ల దేవ దూతల స్వరం ఒకటై ఆయనే సర్వ శక్తిమంతుడని, సకల ఐశ్వర్యములకును, జ్ఞానములకును మూలమని, బలమునకు ఆయనే ఆధారమని, ఘనతామహిమల సమ్మిళిత స్తోత్రములతో ప్రభువును ఆరాధించుట గమనించాలి.

ఆరవ ఆరాధన : ప్రకటన 5:13 “ అంతట పరలోకమండును భూలోకమందును భూమిక్రిందను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును – సింహాసనాసీనుడైయున్న వానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని.”

పైన చదివిన నాలుగవ అయిదవ ఆరవ ఆరాధనల ధ్వని సర్వలోకంలో ఎలా ప్రతిధ్వనిస్తోందో ఇక్కడ చూడగలం. దిక్కులు పిక్కటిల్లేలా చేసే ఆ పరలోకపు ఆరాధన అటు పరలోకంలోనూ ఇటు భూమిమీదను భూమిక్రిందను సముద్రంలోను సృష్టింపబడిన దేదైనను ఆరాధించక మానలేదు. సృష్టింపబడిన ప్రతి సృష్టము తన సృష్టికర్తను ఆయన ఘనతా మహిమ ప్రభావములను స్మరించి స్తుతించుట ఈ దర్శనంలో ప్రకటన గ్రంథకర్త చూసాడు. అది మన కన్నులకు ఆశ్చర్యమే, మన జ్ఞానమునకు మించినదే.

ఏడవ ఆరాధన : ప్రకటన 6:10 “ వారు – నాధా, సత్యస్వరుపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భునివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.”

యోగ్యుడైన క్రీస్తు ప్రభువు ఆ గ్రంథము యొక్క అయిదవ ముద్రను విప్పినప్పుడు తమ ప్రాణములు అర్పించిన హతసాక్షులైన వారి ఆత్మల స్వరం వినిపిస్తోంది. అనేక ప్రవక్తలను నీతిమంతులను అనగా వాక్యము కొరకును ప్రభువు కొరకును సమర్పించుకొనిన వారిని బలిగొన్న ఈ భూలోకానికి త్వరగా తీర్పు తీర్చమని న్యాయాధిపతియైన దేవుని ఆ యాత్మలు అడుగుతున్నాయి. అవి సంభోదిస్తూ యోగ్యుడైన ఆ దేవుడే ఆయన నాధుడని, ఆయనే సత్యమునకు మరో రూపమని పరిశుద్ధుడని ప్రభువును ఘనపరచుట గమనించాలి. తెల్లని వస్త్రములు ధరించియున్న వీరు సజీవులై భూమి మీద ఉన్నప్పుడు ప్రభువును మందిరంలో ఆరాధించారు, హతసాక్షులై పరలోకానికి వెళ్ళి అక్కడ బలిపీఠంక్రింద ఆరాధిస్తూనే ఉన్నారు.

ఎనిమిదవ ఆరాధన : ప్రకటన 7:9,10 “ ... సింహాసనము యెదుటను గొఱ్ఱెపిల్ల ఎదుటను నిలువబడి – సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశభ్ధముతో ఎలుగెత్తి చెప్పిరి.”

7వ అధ్యాయంలో తమ నుదిటిపై దేవుని నామం ముద్రింపబడినవారిని చూస్తాము. ఇశ్రాయేలు 12 గోత్రముల నుండి వచ్చిన 1,44,000 మందితో కలిసి ఎత్తబడినవారి గుంపు ఆరాధించటం గమనార్హం. రారాజు క్రీస్తు యెరూషలేము ప్రవేశానికి సాదృశ్యంగా ఖర్జురపుమట్టలు పట్టుకున్న సకల పరిశుద్ధులు ఒక లెక్కింపజాలని సమూహంగా ఉన్నారు. వారంతా క్రీస్తు రక్తంలో కడుగబడి రక్షణానుభవం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. పరలోకంలో వారికి ఇచ్చిన ఆ ప్రవేశమును బట్టి తమ రక్షకునికి స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిన ఆ మహా శబ్ధం ఒక వర్ణంచలేని ఆరాధన. ఆది అనేక భాషలలో అనేక స్వరములతో ఏక కంఠంగా ఏక ఆత్మతో సాగుతున్న ఒక అద్భుత ఆరాధన.

తోమ్మిదవ ఆరాధన : ప్రకటన 7:11, 12 “దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడి యుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి – ఆమేన్: యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి: ఆమేన్

వీరు పరలోకమందలి ఆలయంలో ఆరాధించువారు. వారు శ్రమల కొలిమిలో పరీక్షింపబడినవారు. గొఱ్ఱెపిల్ల రక్తములో ఉదుకబడిన తెల్లని వస్త్రములు ధరించినవారు. శ్రేష్ఠమైన వారి ఆరాధన వారిని నిత్యమూ ఆ గొఱ్ఱెపిల్ల కాపరత్వములో ఉంటూ జీవజలముల బుగ్గలకు చేరువవుతూ ఉంటారు. వారు నిత్యానందభరితులై కృతజ్ఞతాపూర్వక ఆరాధన అర్పించువారు.

పదియవ ఆరాధన : ప్రకటన 11:16,17 “అంతట దేవుని ఎదుట సింహాసనాసినులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాస్టాంగపడి దేవునికి నమస్కారము చేసి – వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించు చున్నాము.”

రాజైన యేసుక్రీస్తుకు సర్వ రాజ్యాధికారము ఇవ్వబడగానె పరలోక రాజ్యము ఈలోక రాజ్యము క్రీస్తు రాజ్యమైపోయాయి. ఇక యుగయుగములవరకు ఆయనే రారాజు. ఆయన రాజ్యము అంతములేనిది. సర్వకాలములకు ఆయనే ప్రభువు. ఆ నిత్యరాజ్యంలో అనునిత్యమూ వారి ఆరాధనా అంతములేనిదై యుండును.

పదకొండవ ఆరాధన : ప్రకటన 15:3,4 “వారు – ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి: యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి: ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచ బడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చెసెదరని చెప్పుచు... పాడుచున్నారు”

సమయము కొంచమే అని గర్జించు సింహమువలె తిరుగులాడుచున్న ఆ క్రూరమృగము తనకు నమస్కరించు ప్రతివారికి నొసటియందేమి చేతి మీదనేమి ముద్రవేస్తూ ఉంది. తీర్పు దినము సమీపించిన కొలది అ క్రూరమృగము వారిని బలవంతము చేయుచు తన సంఖ్యయైన 666 తో ముద్రిస్తూ ఉంటుంది. ఆ మృగమునకు లోబడక దాని ప్రతిమకు నమస్కరింపక జయించినవారు జయశీలుడగు క్రీస్తుని కిర్తనలతోను స్తుతిగీతములతోను ఆరాధిస్తున్నారు.

పదునెండవ ఆరాధన : ప్రకటన 19:1,4,6-7 “... గొప్పస్వరము – ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును: ... రెండవసారి వారు – ప్రభువును స్తుతించుడి అనిరి”. “ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి – ఆమేన్, ప్రభువుని స్తుతించుడి”. “... ఒక స్వరము – సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఎలుచున్నాడు; ఆయనను స్తుతించుడి”.

గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఎత్తబడిన సంఘ వధువు తనను తాను సిద్ధపరచుకొని యున్నది. అక్కడ పరలోకపు విందు, అది పరిశుద్ధ విందు, అదే గొఱ్ఱెపిల్ల పెండ్లి విందు. అంబరాన్నంటిన సంబరాలేవి దానికి సాటిరావు. అది ఒక అద్భుతమైన ఆరాధన. ఆ ఆరాధనలో బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పదే పదే ప్రభువును స్తుతించుడి అంటోంది. ఆ ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు ప్రభువును స్తుతించుడి అంటున్నాయి. సింహాసనము యెద్ద నుండి ఒక స్వరము ప్రభువును స్తుతించుడి అంటోంది. స్తుతి స్తుతి స్తుతి ఇదే ఆ గొఱ్ఱెపిల్ల పెండ్లి పాట!.

ఆత్మదేవుని ఆత్మతో చేసే యదార్ధమైన ఆరాధన ఎలా వుంటుందో పరలోకంలో జరుగుతున్న ఈ ఆరాధనల ద్వారా తెలుసుకొనగలము. ప్రతి విశ్వాసి అట్టి స్వఛ్ఛమైన ఆరాధన నేర్చుకోవాలి, చేయాలి. ఆమేన్!

rigevidon reddit rigevidon headache rigevidon quantity