సిలువ యాత్రలో సీమోను

  • Author: Rev. John Babu K
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Volume 2 Issue 3 Feb-Mar 2012

లూకా 23:26-31 “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.”

కురేనీయుడైన సీమోనుకు కొంత సమయం యేసు ప్రభువుతో పాటు సిలువను మోసే భాగ్యం కలిగింది. ఇతడు ఆఫ్రికా ఖండం లోని కురేనియ(లిబియ) దేశస్థుడు, పల్లెటూరివాడు. కురేనియ దేశస్థుడు గనుక ఇతనిని కురేనియుడైన సీమోనని పిలిచారు. యూదా మతస్థుడైనందున పస్కా పండుగను ఆచరించి ఆనందించాలని దేవుని పవిత్ర దేవాలయం ఉన్న యెరూషలేము పట్టణానికి వచ్చాడు.

ఆరోజు శుక్రవారం. పస్కా పండుగ సందర్భంగా ఆనందోత్సాహాలతో తులతూగ వలసిన యెరూషలేము పట్టణంలో అలజడి తాండవిస్తూ ఉంది. గోల్గొతా మార్గంలో ఒక చోట ప్రజలు గుంపులు గుంపులుగా కూడియున్నారు. కొందరిలో సంతోషం మరి కొందరిలో విషాదం. రోమా సైనికులు సిలువను ఎవరితో మోయించాలో తెలియక దిక్కులు చూస్తున్నారు ఎందుకనగా సిలువను మోయుచున్న యేసు సిలువ క్రింద పడిపోయాడు. సిలువ యాత్ర అనూహ్యంగా ఆగిపోయింది. ఆ సమయంలో కురేనీయుడైన సీమోను మనుష్యులను త్రోసుకుంటూ ముందుకు వెళ్లి అక్కడ జరుగుతున్న నరమేధాన్ని చూచి బిత్తరపోయాడు. కొరడా దెబ్బలతో కట్టబడి చీరి పోయిన యేసు ప్రభువు యొక్క శరీరం నుండి రక్తం కారుతూ ఉంది. నీరసించి పోయిన ప్రభువు తాను మోయుచున్న సిలువ క్రింద సొమ్మసిల్లి పడిపోయాడు. సైనికులు ఆయనను కొరడాలతో కొట్టి బలవంతంగా లేపుచున్నారు గాని ఆయన లేవలేక పోవుచున్నాడు. అది చూచిన కురేనీయుడైన సీమోను హృదయం మానవత్వంతో చలించిపోయింది. ఎవరీ ఘోర కార్యం చేసింది? అని అతని మస్తిష్కంలో ఎన్నో ప్రశ్నలు.

యెరూషలేము పట్టణం లోని యుదా మాత నాయకులు, మహోన్మాదులు, ప్రధాన యాజకులందరు కుమ్మక్కై – నీతిమంతుడు, నిందారహితుడైన నజరేయుడైన యేసును నిందల పాలు జేసి, దూషించి, కొరడాలతో కొట్టించి, పిడిగుద్దులు గుద్ది, ముఖముపై ఉమ్మివేసి, అన్యాయపు తీర్పు తీర్చి సిలువ మరణానికి అప్పగించారు.

ఇమ్మనుయేలై అందరికి తోడుగా నిలిచిన ప్రభువుకు శ్రమ కలుగగానే ఎవ్వరూ తోడు రాలేదు – తల్లియైన మరియ, ప్రియ శిష్యుడైన యోహాను మాత్రం సిలువ చేరువలో నిలిచారు.

యేసు ఎవరో, సిలువను ఎందుకు మోయవలసివచ్చిందో కురేనీయుడైన సీమోనుకు తెలియదు. ఈ సిలువ యజ్ఞం ప్రవచనాల నెరవేర్పని బొత్తిగా తెలియదు. యెషయా 53:5 ప్రకారం “మన యతిక్రమ కార్యములను బట్టి అతడు (యేసు) గాయపరచబడెను, మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతీవాడును తన కిష్టమైన త్రోవకు తోలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు, వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను”. అంతేకాకుండా – అపరాధములవలనను, శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మనము మృతులమైయుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞలవలన మన మీద ఋణముగాను, మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండ దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతో కూడ మనలను జీవింప జేసి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా జేసి సిలువ చేత జయోత్సవముతో వారిని వట్టె తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచుటకే ఆయన సిలువను మోయుచున్నాడని” అతనికి తెలియదు. అతనికి తెలిసినదల్లా మానవత్వమే. మానవత్వపు విలువలతో ప్రభువు కళ్ళలోకి చూచాడు. ఏ కన్ను దృష్టి ఈ లోకాన్నంతా పరీక్షించి చూస్తుందో ఆ ప్రభువు దృష్టిలో పడిన కురేనీయుడైన సీమోను తన గమ్యాన్నే మార్చివేసుకొన్నాడు. తన హృదయంలో కలిగిన ప్రకంపనలను అణచుకుంటూ రాణువవారి బలవంతాన్ని ప్రక్కనబెట్టి, సిలువ మోయుటే తన కర్తవ్యం అన్నట్లుగా, ప్రభువుతో పాటు సిలువను భుజాన వేసుకొని మోయడం మొదలు పెట్టాడు.

అనామకుడైన కురేనీయుడైన సీమోను సిలువ యాత్ర చరిత్రలో అందరికీ తెలిసినవాడయ్యాడు. ఆదర్శ ప్రాయుడుగా సుస్థిర స్థానాన్ని పొందాడు.

మార్కు 15:22 లో కురేనీయుడైన సీమోను అలక్సెంద్రునకును, రూపునకును తండ్రియని పెర్కొనబడియున్నది. ఈ ఇరువురు కుమారులు అంట పేరెన్నికగన్న వారుగా నిలుచుటకు కారణం వారు దేవుని సంఘంలో చేసిన నిస్వార్ధ సేవ. అలా చేయుటకు వారి తండ్రియైన కురేనీయుడైన సీమోను ముఖ్య కారణం. యేసు ప్రభువు పాపుల పాప పరిహార్ధమై సిలువలో మరణించుటకు ప్రత్యక్షంగా చూచిన ఇతడు వారి జనాంగము ఎదురు చూచుచున్న రాబోయే మెస్సీయా యేసే అని తెలుసుకున్నాడు. సిలువలో యేసు పలికిన ఏడు మాటలు జీవపు బాటలుగా గ్రహించి, యేసే మార్గము, సత్యము, జీవము అని గ్రహించాడు.

శ్రమపడుతూ సిలువను మూసిన శుక్రవారం అతని జీవితంలో శుభ శుక్రవారమైంది. ఎందుకనగా దేవుని ప్రేమను సిలువలో కన్నులారా చూచాడు. ప్రభువు యొక్క అపారమైన శక్తిని, పైశాచిక శక్తులపై అతని విజయాన్ని చూచి తరించాడు. ఎన్నడు చూడని సుదీర్ఘమైన సూర్యగ్రహణంతో కలిగిన చీకటిని, ఆ చీకటిలో యేసు ప్రభువు సిలువలో వ్రేలాడుచు తండ్రియైన దేవునితో మాట్లాడిన మాటలను విన్నాడు. మానవుడు చేసిన పాపమునకు ఫలితంగా కలిగిన దేవుని ఉగ్రతకు గురియైన ప్రకృతిని, అనగా అభేడ్యమైన చీకటిని, భూమి కంపించుటను, బండలు బ్రద్దలగుటను, సమాధులు తెరువబడి పరిశుద్ధులైన మృతులు తిరిగి బ్రతుకుటను, సిలువలో ప్రభువుతో పాటు వ్రేలడుచున్న దొంగ మారు మనస్సు పొందుట, ఫలితంగా యేసు ప్రభువతనికి పరలోక రాజ్యాన్ని దయచేయుటయు, అన్యుడైన శాతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారు భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి – నిజముగా ఈయన దేవుని కుమారుడని చేపుకొనుట చూచి, యెరూషలేము పట్టణంలోనే ఆదివారం వరకు వేచియుండి మరణమును జయించి తిరిగి లేచిన యేసును గూర్చి విని, పరవశించి యేసును రక్షకునిగా అంగీకరించి త్వరత్వరగా తన గ్రామమునకు తిరిగి వచ్చి తన కుటుంబాన్నంతటిని అనగా తన భార్యను, కుమారులిద్దరికి జరిగిన విషయాలన్నింటిని చెప్పి రక్షణలోనికి నడిపించాడు. కుమారులిద్దరు సంఘ సేవలో ప్రసిద్ధులయ్యారు. భార్య దైవ సేవకులకు సేవ చేస్తూ సువార్త సేవలో పరోక్షంగా పాలు పంచుకుంది. భక్తుడైన పౌలు ఈమెను తల్లిగా గౌరవిస్తూ – ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి అని కీర్తించాడు (రోమీయులకు 16:13).

తన కుటుంబాన్ని నిజమైన క్రైస్తవ కుటుంబంగా మార్చి సిలువ శ్రమలో తనవంతు పాత్రను పోషించిన కురేనీయుడైన సీమోను నిజంగా ధన్యజీవి. ఈ విధంగా ఇతడు ఆశీర్వదింపబడటానికి ముఖ్యమైన కారణాలు:

యేసు ప్రభువు మానవ పాప పరిహారార్ధమై సిలువలో బలియై తన ప్రాణము పెట్టుటను స్వయముగా చూచి యేసు క్రీస్తే నిజమైన రక్షకుడని అంగీకరించి ఆయనయందు విశ్వసించాడు.

సిలువను మోయమని రాణువవారు బలవంతము చేసినపుడు ఎవరికీ లేనిది తనకెందుకులే అని తప్పించుకొని వెళ్ళిపోకుండా క్రీస్తు శ్రమను పంచుకొనుటకు ఇష్టపడి సిలువను మోసాడు.

యేసును గోల్గొతాలో సిలువ వేయగానే ఇక అతనితో పనిలేదని వదిలి వేసారు; గాని అతడు తన జీవితంలోను తన కుటుంబంతో సహా సిలువను వదలలేదు.

తాను సిలువను మోసినందుకు ఫలితంగా సంఘంలో పదవిని ఇవ్వమని కోరలేదుగాని, అతడే తన భార్యను కుమారులిద్దరిని ప్రభువు సేవకు సమర్పించాడు.

సిలువ యాత్రను తన జీవిత యాత్రగా మార్చుకొన్న ధన్యజీవి.

యేసు ప్రభువు చెప్పినట్లే చేసాడు – లూకా 9:23 “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను”. ఇదే సిలువ యాత్ర. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరుల్లారా ! సిలువ యాత్రలో కురేనీయుడైన సీమోనువలె పాల్గొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించు కుందాము.

దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.