హృదయ కుమ్మరింపు ప్రార్థన

  • Author: Unknown
  • Category: Messages
  • Reference: General


నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు
విలాపవాక్యములు 2:19

-నీవు లేవాలి.
ఎక్కడ నుండి? ఆధ్యాత్మికమైన మత్తులో నుండి.

-లేచి ప్రార్ధించు.
ఎప్పుడు? రాత్రి మొదటి జామున

-అంటే ఎప్పుడు?
జాములు నాలుగు
1. రాత్రి6 నుండి 9వరకు
2. 9 నుండి 12 వరకు
3. 12 నుండి 3వరకు
4. 3 నుండి 6వరకు
అంటే? నీవు నిద్రపోకముందే ప్రార్ధించాలి.

-ఎవరి కొరకు?
నీ పసిపిల్లల కొరకు

నా పిల్లలు పసివాళ్ళు కాదని తప్పించుకోవద్దు. కాకపోవచ్చు. ఆధ్యాత్మికంగా పసివారే కావొచ్చు.

-ఎట్లా ప్రార్ధించాలి?
నీ హృదయాన్ని దేవునిసన్నిధిలో కుమ్మరించి, కన్నీటితో ప్రార్ధించు.

-ఎందుకు వారి గురించి ప్రార్ధించాలి?
ఆకలితో మూర్చిల్లి పోతున్నారు గనుక.

మాకు అంతా సమృద్ధిగా వుంది ఆకలి అంటేనే మా పిల్లలకు తెలియదు అంటావా? అవును! కాదనను. కాని, ఆధ్యాత్మికమైన ఆకలితో మూర్చిల్లిపోతున్నారు. ఆధ్యాత్మిక, నైతిక విలువలు కోల్పోయి పతనమైపోతున్నారు.

కారణం?
ఒక తల్లిగా,ఒక తండ్రిగా వారి అవసరాలు తీర్చి వారిని పెంచి పెద్ద చేయడమే మా భాద్యత అనుకుంటున్నాము.దానిని ఎట్టి పరిస్థితులలోనూ కాదనను.
దానికంటే ముఖ్యమైన భాద్యత దేవుడు ఇచ్చిన పిల్లలను దేవుని కోసం పెంచాలి.అది చేయలేకపొతున్నాము.

ఎందుకు పిల్లలు ఆధ్యాత్మికముగా మూర్ఛిల్లి పోతున్నారు ? సూటిగా చెప్పాలి అంటే " ప్రార్థించే తల్లిదండ్రులు కరువయ్యారు"

ఒక్కనిమిషం !!!
నీబిడ్డల కోసం దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించిన అనుభవం నీకుందా?
ఉంటే? నీబిడ్డలు ధన్యులు.
ఒకవేళ లేకపోతే, వారు దారితప్పారు అంటే? దానికి కారణం వారుకాదు. నీవే.

ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు ధన్యులు. ( ధన్యులు అంటే ఆశీర్వాదించబడినవారు ).

1.ఇంగ్లండు దేశానికి చెందిన సూసన్న వెస్లీ తన తొమ్మిదిమంది పిల్లలను రాత్రి పండుకోబెట్టి ఒక్కొక్కరి దగ్గర ప్రార్థించడం మొదలుపెడితే, కొన్ని సందర్భాల్లో చివరివాడికి ప్రార్థించి 'ఆమెన్' అనేసరికి తెల్లవారి పోయేదట. ఆతల్లి ప్రార్థన ఫలితంగా, తన పిల్లలలో "జాన్ వెస్లి" ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడయ్యాడు. "చార్లెస్ వెస్లీ" ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడయ్యాడు. అట్లా తన పిల్లలందరూ దేవుని కోసం జీవించారు.

2. సెయింట్ ఆగస్టీన్ అనే దైవజనుడు ఈరీతిగా చెబుతున్నాడు " నా తల్లియొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యానికిి కొట్టుకొని వచ్చాను "

అయితే? మనగురించి మనబిడ్డలిచ్చే సాక్ష్యం ఏమిటి ?
కనీసం ఈరోజు అయినా మొదలు పెడదామా? నాకు ప్రార్థించడానికి ప్రత్యేకమైన గది లేదని చెప్పకు. అవసరం లేదు నీహృదయంలో ఆయనకు గది (స్థలం) వుంటేచాలు.

నీవు నిద్రపోక ముందే నీ బిడ్డలకోసం ప్రార్ధించాలి. ఆతర్వాత,
సూర్యునికంటే ముందుగాలేచి నీ బిడ్డలకోసం "ప్రార్థనాకంచెను " వెయ్యాలి. ఆరోజు ఆకంచెనుదాటి సాతాను నీపిల్లల జోలికిరాలేడు.

సాతాను మన ఇంట్లో
ప్రవేశించాక, తీరికగా ప్రార్థన కంచెను వేస్తున్నాము .ఇక వాడు ఆ కంచెలోపలే తిరిగుతున్నాడు. మనకు, మన కుటుంబాలకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. మనం కంచెవేయాల్సింది వాడు ప్రవేశించక ముందు.

నీ అలారం నిన్ను లేపడంకాదు. నీ ప్రార్థన సమయం నీకు అలవాటుగా మారాలి. భారము కలిగిన తీర్మానంతో ఒక వారం ప్రయత్నించి చూడు. అది అలవాటుగా మారుతుంది. నీ అలవాటు నీ కుటుంబానికి శాంతి,సమాధానం, సమృద్ధినిస్తుంది.

ఒక తండ్రిగా యోబుకూడా తన పిల్లలు తప్పు చేసారనికాదు. ఒకవేళ తప్పుచేసి వుంటారేమోనని? నిత్యము బలులను అర్పిస్తూ వుండేవాడు. తండ్రిగా నీవు కూడా నీ బిడ్డలకోసం వేకువజామున 'ప్రార్థనా బలిపీఠం' కట్టాలి.

ప్రయత్నించి చూడు. ఇక నీబిడ్డలు ఎన్నటికీ మూర్ఛిల్లి పోరు. నిజమైనతల్లిగా, తండ్రిగా దేవుడు మనకిచ్చిన భాద్యతలు నెరవేర్చిన వారమవుతాము. ఆయన ఇచ్చే గొప్ప బహుమానానికి అర్హులమవుతాము.

ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!

అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్.