లవ్ & ట్రూ లవ్ ...... (ప్రేమలో మాదిరి)

  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12

'ప్రేమ' ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంత మైన పదం. నేటికినీ మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దాని అర్ధమేమిటో తెలియకున్నా అది చేసేపనులు లెక్కలేనన్ని.

లోకం దృష్టిలో ప్రేమంటే? మూడవ తరగతి చదివే అబ్బాయి, అదే తరగతి చదివే అమ్మాయికి ' l LOVE U' అని వ్రాసి ఆ అమ్మాయి బుక్ లో పెట్టేసాడు. అంటే? ప్రైమరీ నుండే ప్రారంభ మయిపోయింది ప్రేమ.

ఒక టీనేజర్ ప్రేమంటూ తిరిగీ, తిరిగీ, పరీక్షల ఫలితాలు వచ్చాక తెలిసింది ప్రేమంటే ఏమిటో? Loss Of Valuable Education అని. మరొకడేమో రాత్రంతా చాటింగ్. నిద్రలేక నీరసం వచ్చాక వాడికి అర్ధమయ్యింది ప్రేమంటే? Loss Of Valuable Energy.అని

ఒక అబ్బాయికి ఒక అనుమానం. నా గర్ల్ ఫ్రెండ్ నా పేరును తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకుందో అని. మొత్తానికి తెలుసుకున్నాడు. ' 'టైం పాస్ 20' అని. అంటే? వీడి క్రింద ఇంకో 19 మంది. వీడిపైన ఎంత మందో? ఇప్పుడు వీడికి అర్ధమయ్యింది ప్రేమంటే? 'టైం పాస్' అని.

ఒకడేమో రక్తంతో వ్రాసేస్తాడు ( అది కోడి రక్తమో? వాడి రక్తమో? వేరే సంగతి) ఒకడేమో కత్తితో పొడిచి, మరొకడేమో యాసిడ్ పోసి చంపేస్తాడు. ఏమిటిది? అని అడిగితే నాకు దక్కనిది ఇంకెవ్వరకూ దక్కకూడదు. ప్రేమంటే ఇదే అంటాడు.

'ప్రేమికుల రోజు' (వాలెంటైన్స్ డే) ఇదొకటి.ఆ రోజు 'నా హృదయంలో నీకుతప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు' అంటూ వ్రాసి 'అందరికీ' పంచుతాడు. అదేంటి అంటే? ప్రేమ అంటే అంతే అంటాడు.

ఇక తల్లి ప్రేమ! ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరి తరమూకాదు. కాని వారి అక్రమమైన జీవితాలను కొనసాగించడానికి కన్న బిడ్డలను సహితం కర్కషంగా చంపేసే తల్లులెందరో? ఆ తల్లి ప్రేమకూడా కలుషితమవుతుంది.

ఇక అందరికీ తల్లి 'మదర్ థెరీసా' ఆమె ప్రేమ స్వచ్చమైనది. ఎవ్వరూ కాదనలేనిది. కాని, పరిపూర్ణమైనది కాదు. ఆ ప్రేమ కొందరికే పరిమితం, కొంత కాలమే పరిమితం. శారీరికమైన స్వస్థత చేకూర్చ గలిగిందిగాని, పాప రోగం నుండి మనిషిని విడిపించ లేకపోయింది.

ఇంతకీ, నిజమైన ప్రేమ అంటే ఏమిటి?

ఈ లోకంలో 'నిజమైన ప్రేమకు' అర్ధాన్ని, నిర్వచనాన్ని చెప్పిన వాడు ఒకే ఒక్కడు.

ప్రేమకు అర్ధం, నిర్వచనం? నిజమైన ప్రేమకు అర్ధం, నిర్వచనం 'నీ ప్రియ రక్షకుడే'. ఆయన ప్రేమాస్వరూపి ( ఆయనే ప్రేమయై వున్నాడు) 1 యోహాను 4:8,16

ఆయన ప్రేమతత్వం: శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44) మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా. మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)

ఆ ప్రేమ యొక్క లక్షణాలు: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును. 1 కొరింది 13:4-8

నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుగాని, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తావని. కనీసం తలిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ వుంటుంది. పిల్లలు పెద్దవారై వారిని కూడా ప్రేమగా చూస్తారని.

కాని, ఆయన ప్రేమ బదులాశించనిది. అది అమరం, అతిమధురం,అపురూపం. అవధులులేనిది అద్వితీయమైనది. సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది. మరణము కంటే బలీయమైనది. సజీవ మైనది, శాశ్వతమైనది.

అట్టి ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.