భూమి కంపించదా?

  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries

ప్రస్తుతము మనము ఏ రోజుల్లో ఉన్నామో చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఎక్కడ చూసినా, హత్యలు, కిడ్నపులు, దారుణహింసలు, దాడులు ప్రతిదాడులు చూస్తూనే ఉన్నాం. ఇవి చూస్తున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు అని ఆలోచన మనకురావచ్చు. వాటిని ఆపడా? ఎంతవరకు ఇవి కొనసాగుతుంటాయి, ముగింపు ఎప్పుడని అందరము ఎదురుచూస్తుంటాము.

*పరలోకములో ఉండే దేవుడు ఏం చేస్తున్నాడు? :*

భూమ్మీద ఉండే మనుష్యులు పాపములో మునిగి పొర్లాడుతున్నారు. అలాంటి వీరిని దేవుడు శిక్షించడా? శిక్ష వీరికి పడదా? అనే ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం ఒక్కటే. అందరిని దేవుడు ప్రేమిస్తాడు? అందరియెడల జాలిగలిగిన వాడు కనుక మనకు సమయాన్ని ఇస్తుంటాడు. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం కలుగుతుందేమో అని అనేకసార్లు అవకాశాలు ఇస్తుంటాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటే మనకు మంచిది. లేకపోతే తీవ్రమైన ప్రమాదం మన వాకిట పొంచియుంటుంది.

*బైబిల్ గ్రంథములో ప్రజలలో ఉన్న పాపాన్ని గూర్చి కనువిప్పు కలుగకపోతే దేవుడు ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతాం :*

1)     120 సంవత్సరములు నోవాహు వాక్యాన్ని వినిపించిన లోపడనందున 40 పగుళ్లు, 40 రాత్రులు ఆగకుండా ప్రచండమైన వర్షం కురిపించుట చేత భయంకరమైన జలప్రళయాన్ని పంపించాడు.

2)     సొదొమ, గొమోఱ్ఱాలో ప్రజలు నైతిక విలువలు కోల్పోవడం చేత మొత్తం పట్టణాన్ని యెహోవా దేవుడు ఆకాశము తెరచి, దహించు అగ్నిని కురిపించి కాల్చివేశాడు.

3)     ప్రజలు మితిమీరి పాపము చేయటం ద్వారా అంతేగాక న్యాయధిపతుల మాటలు వినకపోవటం చేత దేవుడు బెత్లెహేములో కరువును  పంపించాడు.

 

ఆ దినములలో అంత తీవ్రమైన ఉగ్రతలను దేవుడు ప్రజల మీదికి పంపినప్పుడు, నేడు అలాంటి ఉగ్రతలు ఎందుకు అమలు కావటం లేదు.

వాక్యము ఏమి చెపుతుంది. *ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. (అపో. కా. 17:30).*

వాక్య భాగాన్ని తరచి చూస్తే ప్రజల్లో మార్పు తేవడానికి దేవుడు ఎన్ని మార్గాలు గుండానైనా ప్రజలను రక్షణమార్గములోనికి అనగా పాపమును విడచి, మారుమనస్సు పొంది వారిని నడిపించడం దేవుని ఉన్నతమైన ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా మనుష్యులలో మార్పు తేవడానికి కొన్నిసార్లు దేవుడు ప్రకృతి భీభత్సాలను వాడుకుంటాడు. ప్రకృతి భీభత్సం పేరు వినగానే భయం, పిడుగులు పడుతుంటే భయం, భూమి క్రిందలోనుండి గాని ఆకాశం పైనుండి గాని ఏదైనా భీకరమైన శబ్ధం వస్తే భయపడిపోతాం. అలాంటిది దేవుడు ఒక భీభత్సాన్ని పంపిస్తే దాన్ని చూచి విని తట్టుకోగలవా? ఏదేమైనా దేవుని అనుమతి లేనిదే ఏమి జరుగదు. కావున వీటిని దేవుడు పంపించినప్పుడు మార్పు చెంది, రక్షించబడాలని దేవుని సంకల్పము నెరవేర్చబడడానికి మనం సిద్ధం గా వుండాలి.

ప్రపంచములో ఎక్కడ చూసినా పాపం పేట్రేగిపోతోంది. మన దేశంలో ఎక్కడ చూసినా పాపం తాండవం చేస్తుంది. బీహార్ లోని ఒక్క జిల్లాలో పట్టపగలే ఇంటికి వెళ్తున్న తల్లి కుమార్తెలను అతి దారుణంగా కొంతమంది దుండగులు దాడి చేసి మానభంగం చేశారు. ఆ తరువాత ఏమి జరిగింది భయంకరమైన పిడుగులు బీహార్ లో పడడం చూస్తాం.

ప్రకృతి బీభత్సాలలో మొదటి స్థాయి పిడుగులు పడతాయి. రెండవ స్థాయిలో ఎడతెరిపి వర్షాలు పడతాయి. మూడవ స్థాయిలో భూకంపం వస్తుంది. నాల్గవ  స్థాయిలో సముద్రములో భూకంపం ఆ తరువాత ఐదవ స్థాయిలో భీకరమైన భూకంపం సంభవిస్తుంది.

ప్రస్తుతం మనమంతా మొదటి స్థాయి, రెండవ స్థాయి దాటి ఉన్నాము. ఈ రెండు స్థాయిలు దాటగానే మనం ఎదుర్కొనబోయేది భూకంపమే. ఇంతవరకు పాశ్చాత్య దేశాలలో రిక్టర్ స్కేలుపై భూకంపం నమోదుకావడం చూశాం. ఈమధ్య భారతదేశములో భూకంపం రిక్టర్ స్కేలుపై నమోదుకావడం చూస్తున్నాం.  ఢిల్లీలో, అక్కడక్కడ ప్రకంపనాలు చూశాం. భూకంపాలలో ఇది మొదటి స్థాయి అని గ్రహించాలి. రెండు, మూడు స్థాయిలలో భూమి సర్వనాశనం జరగడం చూస్తాం. ఒకవేళ భారతదేశములో పూర్తిగా సంభవిస్తే ఏం జరుగుతుంది.

. కాబట్టి ప్రకంపనలతో ప్రారంభమయ్యే భూకంపం మన రాష్ట్రములో కూడా ఎక్కడైనా విరుచుకుపడే అవకాశముంది. ఎక్కడ ఎప్పుడు అనేది అప్రస్తుతం.

అందుకే భక్తుడైన *ఆమోసు 8వ అధ్యాయములో* భూమి కంపించదా? అన్నాడు. కారణమేమిటి? ప్రజల పాపం, ఘోరమైన స్థితికి వచ్చినప్పుడు ఈ మాటలు పలికాడు. ఆమోసు భక్తునికి కోపమోచ్చి ఈ మాటలు పలుకలేదు గాని దేవుడు దర్శనములో చూపించిన ఈ విషయాన్ని మనకు బహిర్గతం చేశాడు. అసలు ఏమైంది అక్కడ? ఇశ్రాయేలీయులు చేసిన తప్పేంటి. విచిత్రమైన గొంతెమ్మ కోర్కెలతో ఇశ్రాయేలు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏమిటి వారి విచిత్రమైన కోరికలు.

1)     బీదలు కనుమరుగైపోవాలి.

2)     దరిద్రులు కనబడకూడదు.

దీని భావమేమనగా మేము తప్ప ఎవ్వరు బ్రతకకూడదు అనే ఘోరమైన ఆలోచనతో ఉన్న ఈ ప్రజలు మరీ చెడు ఆలోచనతో కూడా ఉన్నారు. అదేమిటంటే దొంగ త్రాసుతో మోసకరమైన వ్యాపారము చేయాలి. అంతకంటే నిష్టూరమేమనగా చచ్చు ధాన్యం అమ్మడానికి బరితెగించారు. ఈలాంటి వారిని చూచి దేవుడు ఆమోసుతో ఈ మాటలు పలికించాడు. భూమి కనిపించదా? పైన పేర్కొనబడినవి చూడ్డానికి చాలా తేలికైనవే. కానీ దేవుని దృష్టిలో ఘోరమైన పాపాలు. ఇవే దేవుని దృష్టిలో ఘోరమైన పాపాలైతే, మనం చేసే పాపాలు ఎలాంటివి? క్రూరమైన హత్యలు, కిడ్నాపులు, వ్యభిచారం, ఇంకా ఎన్నెన్నో?  ఇవి దేవునికి ఎంత కోపం కలిగిస్తాయో మనకు తెలియదు.

మనం చేసే పాపాలు మనకు తప్పు కాకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి ఘోరమైనవే. అయితే  మనమనుకునేది ఒకటి. క్షమాపణ కోరితే చాలు దేవుడు క్షమిస్తాడు అనే ఆలోచన మనది.  మరలా మరలా పాపం చేస్తూ పోతుంటే దేవుడు చూస్తూ  ఊరకుండే దేవుడు కాదు. కాబట్టి మనలో ఏ పాపం, ఏ బలహీనత లేకుండా ఉంటే నువ్వు క్షేమం, భూమి క్షేమం. లేకపోతే అంతే సంగతులు. దేవుని వాక్యము మనకు విరివిగా వినబడుతున్నా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. పై పెచ్చు దూషిస్తాం. ప్రేమించే దేవునిపై ఆగ్రహిస్తే నీవు నీ కుటుంబం ఒక క్షణమైన భూమిమీద బ్రతకలేదు జాగ్రత్త. పైపైకి చూస్తూ, నడుస్తూ పోతున్న నీవు, నీవు నడిచే భూమి ఎప్పుడు నోరు తెరుస్తుందో తెలియదు. కనుక కింద కూడా చూసి నడవాలి.

కావున దేవుని ప్రేమను అర్థం చేసుకుని మనం పాపం  విడిచిపెట్టి మార్పు చెంది, మనం నివసించే భూమిమీద ఏ ప్రకంపనాలు కలగకుండా జాగరుకులమైయుండి, పాపములేని వారిగా వుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడుదుము గాక!  ఆమెన్.