ప్రతి మనుష్యుని వెలిగించిన దేవుడు


  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

“నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” యోహాను 1:9

క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక! ఈ మాసములో మొదట ప్రారంభించబడే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ గురించి ధ్యానం చేసుకుందాం. మనమీలోకములో జీవించుచున్నాం. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాము. టీ.వీ వార్తలు చూస్తుంటాము. విన్నవన్ని చూచినవన్ని అవి నిజమోకాదో అని నిర్ధారించుకోవడానికి మనకు తెలిసినవారినందరిని అడిగి తెలుసుకుంటాము. ఎవరినుంచి సరియైన సమాధానం రాకపోతే చివరికి ఇంటర్నెట్ ఆశ్రయిస్తాం. ఇంటర్నెట్లో కూడా జవాబు దొరకకపోతే మనం ఎక్కడకు పోయి జవాబును తెలుసుకోగలము?
1) ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్
2) ప్రతి నిజాన్ని బయలుపరచేది బైబిల్
3) ప్రపంచ ఉనికిని చాటిచెప్పేది బైబిల్
4) అన్ని శాస్త్రాల గురించి బయలుపరచేది బైబిల్
5) రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఏం జరుగుతుందో చెప్పేది బైబిల్
6) నీ జీవితాన్ని గురించి చెప్పేది బైబిల్
7) నీ కుటుంబం యొక్క పరిస్థితులను విడమరచి చెప్పేది బైబిల్

కావున నిజమేదో నిజం కానిదేదో తెలిపేది ఒక్క బైబిల్ మాత్రమే. ఇంకోమాటలో లోకంలో ఉండేదంతా లేక సమాచారమంతా ఫేక్ న్యూస్. ప్రజలైతే ఫేక్ న్యూస్ నే నమ్ముతారు. అయితే నిజమైన సమాచారం ఎవరూ నమ్మటంలేదని యెషయా గ్రంథం 53:1లో చూస్తాం. వాక్యం నమ్మదగినది,  పూర్ణాంగీకారమునకు యోగ్యమునైయున్నదని పౌలు 1తిమోతి 1:15లో అంటున్నాడు. ఈ వాక్యం అనగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగినది, యోగ్యమైనది అని చెప్పుటకు నేను మొదటివాడను అని అంటున్నాడు. కాబట్టి బైబిలులో ఉండే ప్రవక్తలందరు చెప్పిన వాక్కులన్ని నమ్మదగినవే, నిజమైనవే. అందుకే యోహాను కూడా నిజమైన వెలుగు ఉండెనని తన సందేశాన్ని ప్రారంభించాడు. కాబట్టి బైబిల్ ఒక్కటే సత్యమైనదని  గమనించాలి. అందుకే యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. మరి ఇప్పుడు అంశంలోనికి వద్దాం.

డిసెంబర్ మాసములో క్రొవొత్తి ఆరాధన ఎందుకు?

జవాబు : ఈ ఆరాధన అవసరమా కాదా అని బైబిలు యొక్క ఆధారాన్ని యోహాను సువార్త 1:9లో చూస్తాం. ఈ వచనములోని మాటలు నిజమైనవి. చదవండి, వినండి, నమ్మండి. ఈ లోకములో వెలుగు అను మాట పలుసార్లు మనం పలుకుతూఉంటాం. అయితే నిజంకానిదెదో నిజమైనదేదో తెలుసుకోవాలి.

నిజముకాని (కృత్రిమ) వెలుగు :-

నిజముగకాని వెలుగులో ప్రకృతి సంబంధమైన వెలుగు కనిపించును. దానిని శరీర సంబంధమైన నేత్రాలతో చూడగలుగుతాం. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ నిజముకాని వెలుగులో చీకటి వున్నది. ఆ చీకటిలో పాపమున్నది. కావున మానవుడు ఈ చీకటిలో ఈ పాపములోనే వుంటున్నాడు.

పాపమానవాళి పరిస్థితి :-
1) పాపి శారీరకముగా చెడియున్నాడు :

ఈ శరీరమెలాంటిదో, ఈ శరీరము దాని ఇచ్చలకు ఎలా లోబడుతుందో పౌలు స్పష్టముగా వర్ణిస్తున్నాడు. 1కొరంథి 6:12-20, గలతీ 5:16-26 ఈ వచనాలు మనం చదివితే శరీరం దాని యిచ్ఛలు లోకసంబంధమైనవే, మానవుడు శరీరానికి  బానిసయైయున్నాడు. ఒక విధముగా పాపానికి దాసుడై దేవుని ప్రణాళికను తృణీకరించాడు. శరీరానికి దాసుడైనవాడు పాపానికి దాసుడే కదా? పాపానికి దాసుడైనవాడు మరణానికి పాత్రుడు కదా ? నీ శరీరం విలువపెట్టి కొనబడినది.  ఈ శరీరాన్ని నీవు అపవిత్రపరచుకోక మరొక మాటలో హాని కలిగించక దేవునిని మహిమపరచుము.

     2)పాపి మానసికంగా చెడియున్నాడు :

మన మనస్సు ఎలాంటిదో ఎవరూ చెప్పలేరు. అయితే ఎఫేస్సీ 4:18లో మనమంధకార మనస్సు గలవారమని పౌలు అంటున్నాడు. దీనికి  మన కఠినమైన హృదయమే కారణం అంటున్నాడు. అంతేగకాక ఈ మనస్సు కలిగి ఉండడానికి కారణం ఈ లోక వ్యర్థతను అనుసరించి  నడుచుకొనుటచేత మానవుడు మానసికంగా చెడియున్నాడు.

     3) పాపి ఆత్మీయముగా చెడియున్నాడు :

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఎప్పుడు ఆరిపోకూడదు. మనలో ప్రాణం, ఆత్మ ,దేహం వున్నట్లు వాక్యంలో చూడగలం. మరణించిన తర్వాత మన ఆత్మ ప్రభువు దగ్గర చేరుటకుగాను ఈ భూమి మీద జీవించినంతకాలం ఆరిపోని దీపంగా నీ ఆత్మ ఉండాలి.  నిష్ ప్రయోజనమైన శరీరాన్ని గురించి కాక ప్రయోజనమగు నీ ఆత్మ చెడిపోకుండా చూసుకో.

నిజమైన వెలుగు :-

వెలుగును స్తుతించటం మనం ప్రయత్నం చేసి జరిపించుకునే ఉత్సవం కాదు. ఇందులో దేవుని యొక్క గొప్ప తలంపు ఇమిడియున్నది. ఎంతో నైపుణ్యంగా, సున్నితంగా మన కొరకు దినదినము  కొరకు  తయారు  చేయబడింది ఈ నిజమైన వెలుగు. ఈ నిజమైన వెలుగును మానవ నేత్రాలతో చూడలేము. మరి ఈ నిజమైన వెలుగును చూడగలిగేది ఎవరు? కేవలం నీతిమంతులు మాత్రమే. ఈ వెలుగును చూచే స్థాయి నీలో ఉందా? ఈ స్థాయి నీలో ఉండాలంటే
1) హృదయ శుద్ధి కావాలి.
2) ఆ హృదయశుద్ధిని యేసుక్రీస్తు రక్తం ద్వారా పొందగలుగుతావు. అప్పుడు నీవు నీతిమంతుడవై నీ ఆత్మీయ నేత్రాలు తెరువబడి ఈ ఉన్నతమైన నిజమైన వెలుగును చూడగలుగుతావు.

నిజమైన వెలుగులో ఉన్న బలమైన శక్తి :-

1) ఈ వెలుగు ముందు ప్రకృతి సంబంధమైన వెలుగు నిలువలేదు.
2) సూర్య కిరణాలు సూటిగా చూడలేని మనం ఈ నిజమైన వెలుగును యేసుక్రీస్తులో చూడగలం 2కొరంథి 4:5,6.

నిజమైన వెలుగులోని లక్షణాలు :-

ఆ వెలుగు మృదువైనది. మృదుత్వం అనే మాట ఒక్క దేవునికి మాత్రమే చెందుతుంది. ఇక మరెవరికి వర్తించదు. ఉదాహరణకు సూర్యకిరణాలు మనం సరాసరి చూడలేము. అది క్రీస్తులో చూడగలుగుతాము అని తెలుసుకున్నాం. ఉదాహరణకు కొన్నిసార్లు ఆకు మీద ఉండే మంచు బిందువులను కాని ఆ ఆకును కాని సూర్య కిరణాలు హాని చేయవు. అలాగే మన గొర్రెల కాపరియైన మన ప్రధాన కాపరియైన యేసు ఇలాంటి మృదుత్వాన్ని కలిగి మన మార్గములో ముందుకు సాగుటకు మనకు అడ్డుపడే దట్టమైన నల్లని పొగ ఉన్నప్పటికి ఆయన మనతో ఉండి మనలను ముందుకు నడిపిస్తాడు. ఆయన ప్రేమగలవాడు. ఆ ప్రేమతో కూడిన మాట, ప్రవర్తన, స్వభావం ఇవన్ని మృదుత్వాన్ని తెలియజేస్తాయి. ఈలాంటి క్రీస్తులోని స్వభావాన్ని  నీవు కలిగియుండాలి.

ఆ వెలుగు స్వచ్ఛమైనది :-

ఎంత అపవిత్రత ఉన్ననూ ఎంత విషపూరిత స్థితి ఉన్ననూ ఈ వెలుగు ఎదురుగా ఉండే ఆటంకాన్ని అధిగమించి దూసుకుపోతూ ఆ స్థలంలో కృపా సువార్త అనే శక్తిని నింపును. ఆ వెలుగు ఏ రకమైన శోధననుండియైననూ విడిపించును ఊ వెలుగు క్రీస్తే ఆయన ఆత్మ స్వచ్ఛమైనది ఆయనలాంటి జీవితంలో గల ప్రభావం మనలో ఉంటే మనం కూడా స్వచ్ఛత, రుచి, పరిశుద్ధత కలిగి ఉంటాం.

ఆ వెలుగు అంతట వ్యాపించును :-

ఆ వెలుగు ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్లగలదు. చీకటిని తొలగించి వెలుగుతో నింపగలదు. తప్పిపోయిన కుమారుని జీవితం చీకటితో నింపబడిననూ ఆ తర్వాత అతనిలో ఈ వెలుగు నింపబడింది. నిన్ను చీకటిలో నుంచి విడిపించగలదు. ఉదాహరణకు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని చంపిన హంతకుడైన ఒక వ్యక్తికి ఉరిశిక్ష అమలైనప్పుడు శిక్షను తప్పించుకొనుటకు అప్పటి రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టమని కోరాడు. ఆ రోజు ఇంటింటికి సువార్తకు చెందిన సేవకులు శిక్ష అనుభవిస్తున్న ఈ వ్యక్తికి శుభసందేశం అనే పుస్తకాన్ని ఇవ్వగా ఆ రాత్రి దాన్ని చదివి మారుమనస్సు పొంది రక్షించబడ్డాడు. ఆ మరుసటి రోజు ఆతురతతో ఎదురు చూస్తూండగా రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పొందాడు. ఎంత అద్భుతం. కాబట్టి ఈ వెలుగు ఎక్కడైనా చొచ్చుకుని వెళ్ళగలదు.

ఆ వెలుగు మర్మములను బయలుపరచును :-

నేను వెలుగై వున్నాను అని చెప్పిన యేసే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. దైవసేవకులకు మరియు మనకు ఆ వెలుగు మర్మములను బయలుపరచును. అమోసు 3:7. ఎలీషా దగ్గర శిక్షణ పొందుతున్న ప్రవక్తల గుంపు ఏలియా ఆరోహణమైపోతాడని ముందుగా తెలుసుకున్నారు. ఎలా తెలిసింది దేవుడే బయలుపరిచాడు. ఆయన మర్మములను బయలుపరచు దేవుడు అనుటకు నిదర్శనం.

దక్షిణాఫ్రికా దేశంలో మూడురోజుల సువార్త మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. వాక్యమందించుటకు గొప్ప దైవజనుడు వచ్చాడు. రెండు రోజులు జయప్రదంగా జరిగాయి. మూడవ రోజు కూడిక ముగింపులో ప్రార్థన అయిపోయిన వెంటనే వచ్చినవారికందరికి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే చివరి ప్రార్థన చేస్తుండగా అక్కడ నుండి దైవజనున్ని వెళ్లిపొమ్మని దేవుని ఆదేశం. అయినా వినకుండా అట్లే ఉన్నాడు. మరల రెండవసారి, మూడవ సారి ఆదేశం. అందరు కళ్ళు మూసుకునియుండగా ఆ దైవజనుడు అక్కడనుండి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిపోయిన వెంటనే సరాసరి ప్రజల దగ్గరికి రెండు పోలీస్ వాహనాలు వచ్చి మొదటి వరసలో కూర్చున్న ముగ్గురిని అరెస్టు చేసుకుని వెళ్లిపోయారు. ఎందుకంటే వారు మరణాయుధాలతో సిద్ధపడి ఆ దైవజనున్ని చంపడానికి వచ్చారు. ఆ సేవకుడు వెళ్ళకపోయి వుంటే ప్రాణాలే పోయేవి. కావున దేవుడు మర్మములు తెలియజేయువాడు అనుటకు పూర్తి నిదర్శనం. కావున మర్మములు తెలియజేయువాడు దేవుడే అని గ్రహించి, ఆ మర్మములను తెలుసుకొనుటకు దేవుని వేడుకొనుము. చీకటిలోనున్న వారికి వెలుగిచ్చుటకు ఈ లోకమునకు ఏతెంచిన యేసుక్రీస్తు ప్రభువులవారిని నీ హృదయంలో చేర్చుకుని, వెలుగుమయమైన క్రిస్మస్ ను అనుభవించి,ఆశీర్వాదకరమైన నూతన సంవత్సరములో ప్రవేశించుటకు ప్రభువు సహాయము చేయునుగాక.
దేవుడు మిమ్ములను దీవించునుగాక! ఆమెన్.