Day 87 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్ళను ముట్టగానే యొర్దాను నీళ్ళు, అనగా ఎగువనుండి పారు
నీళ్ళు ఆపబడి యేకరాశిగా నిలుచును (యెహోషువ 8:13).

లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు! మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీజలం విడిపోయి దారి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చినదంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనస్సులో పెట్టుకుని దాన్ని తప్ప మరి దేన్నీ లెక్క చెయ్యనిదే "మొండివిశ్వాసం"


ఊహించండి, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకుని నిండుగా ప్రవహిస్తున్న నదిలోకి నడుస్తున్నప్పుడు, అక్కడ నిలబడిన వాళ్ళు ఏం అనుకుని ఉంటారో "నేను మాత్రం చస్తే ఇలాటి పని చెయ్యను. ఏమిటి నదీ ప్రవాహానికి మందసం కొట్టుకుపోదూ!" అలాటిదేమీ జరగలేదు. "మందసము మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి" ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకి తోడ్పడుతుంది.


మందసాన్ని మోయడానికి మోతకర్రలున్నాయి. దేవుని నిబంధన మందసమైనా అది తనంతట తాను కదలలేదు. దాన్ని భుజాలకెత్తుకుని మొయ్యాలి. దేవుడు అంచనాలను, పథకాలను సిద్దపరుస్తాడు. వాటిని అమలు పరిచే పనివాళ్ళం మనమే. మన విశ్వాసమే దేవునికి సహాయం. సింహాల నోళ్ళు మూయించేది. దేవుడు దాన్ని గౌరవిస్తాడు. విశ్వాసం ముందుకి సాగిపోతూనే ఉండాలి. మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయతతో ముందుకి సాగిపోయే విశ్వాసం. నాతోటి లేవీయులారా, మన బరువుని ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటికను ఎత్తుకున్నట్టుగా మొహాలు వేలాడేసుకోవద్దు. ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం, పొంగుతూ ప్రవహించే నదివైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం.


అపొస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఓ ప్రత్యేకమైన ముద్ర ఏమిటంటే "ధైర్యం", దేవుని కోసం గొప్పకార్యాలు తల పెట్టి, అపూర్వమైన ఆశీర్వాదాలను దేవునినుండి ఆశీంచే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే. పరిశుద్దత నిండిన సాహసం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయననుండే. అలాటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకి అంటి పెట్టుకుని ఉండడం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడడానికి సందేహం దేనికి? విశ్వాస జీవిత నౌకలో పయనించే నావికులారా, లోతైన సముద్రాల్లోకి నావని నడిపిద్దాం రండి. దేవుడికి అన్నీ సాధ్యమే. ఆయన్ని నమ్మేవాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు.

ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెడదాం రండి. ఆయన్నుండి విశ్వాసాన్ని పొందుదాం. ఆ విశ్వాసం, ఆయన బలపరాక్రమాలు మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి.