Day 37 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను. జనులు కాలినడకచే దాటిరి.అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి (కీర్తనలు 66:6)

ఇది చాలా గంభీరమైన సాక్ష్యం. మహాజలాల్లోనుంచి ప్రజలు కాలినడకన దాటారు. భయం, వణుకు, వేదన, నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం పుట్టింది. "అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి" అంటున్నాడు కీర్తనకారుడు.

తన స్వంత అనుభవంగా ఇలాటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు? "అక్కడ" బాధ, గుబులు గూడుకట్టుకుని ఉన్న సమయాల్లో అంతకుముందెన్నడూ లేనిరీతిని వారు విజయాన్ని, ఉత్సాహాన్ని చవిచూశారు.

నిబంధన మూలంగా వారి దేవుడు వారికెంత చేరువగా వచ్చాడు! ఆయన వాగ్దానాలు ఎంత ధగధగా మెరిసాయి! మనం సుఖసంపదలతో తులతూగుతున్నప్పుడు ఈ ధగధగలు మనకి కనిపించవు. మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది. కాని మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు, దుఃఖాంధకారం మూసినప్పుడు, తారలు గుంపులు గుంపులుగా బయటకి వస్తాయి. ఆశాభావం, ఓదార్పు లనే బైబిల్ నక్షత్ర సమూహాలు తళతళలాడతాయి.

యబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు. ఆయనతో మనం పోరాడి గెలవాలి.

"సాయంకాలమైనప్పుడు రాత్రివేళ కొరకు" అహరోను, సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు. బాధల నడి రాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్వెలు వెలుగుతాయి.

యోహాను "ప్రవాసంలోనే, తన ఒంటరితనంలోనే" తన విమోచకుని దర్శనం పొందాడు. లోకంలో నేటికీ పత్మసులు అనేకం ఉన్నాయి. ఏకాకిగా, శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి, కృప, ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి.

ఈ లోకబాధలనే యొర్దానులు, ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తుచేసుకుంటారు. దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకుని "అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం" అంటారు. ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగసిపడే అలలతో, అగాధల్లో, వరద యొర్దాను భీభత్సంలో "అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి" అంటూ సాక్ష్యమిస్తారు.

"అక్కడ నుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను..." (హోషేయా 2:15).