Day 55 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యోహాను ఏ సూచక క్రియను చేయలేదుగాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి (యోహాను 10:41).

నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకుపడి ఉండొచ్చు. నువ్వు పెద్ద తెలివిగలవాడివి కాదు. ప్రత్యేకమైన వరాలేమీ లేవు. దేన్లోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు. నీది సగటు జీవితం. నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి.

అయినా పర్వాలేదు. నీ బ్రతుకు గొప్ప మహత్తుని సంతరించుకోగలదు. యోహాను ఏమీ అద్భుతాలను చెయ్యలేదు. కాని యేసుప్రభువు అతన్ని గురించి ఏమని చెప్పాడు? "స్త్రీలు కన్నవారిలో యోహానుకన్న గొప్పవాడు లేడు."

యోహాను ముఖ్య విధి ఏమిటంటే వెలుగును గూర్చి సాక్ష్యమివ్వడం. ఈ పనే నువ్వూ నేనూ చేపట్టాలి. అరణ్యంలో వినిపించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవడానికి యోహానుకు అభ్యంతరం లేదు. వినిపించడమేగాని, కనిపించని స్వరంగా ఉండి పోవడానికి సిద్ధపడు. అద్దం వెనుక వేసిన రంగు బయటికి కనిపించదు గాని అది సూర్యతేజాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యోదయమౌతూ ఉండగా పిల్లగాలి వీచి "తెల్లారుతోంది" అంటూ ప్రకటించి తిరిగి చప్పబడిపోతుంది.

అతి సాధారణమైన, అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడన్నట్టుగా చెయ్యి. నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ల ప్రేమను చూరగొనడానికి ప్రయత్నించు.

విత్తనాలను చల్లుతున్న మనం, చిన్నచిన్న కాలువలను తవ్వుతున్న మనం, మనుషుల్లో క్రీస్తును గురించిన చిన్నచిన్న ఆలోచనలను నాటుతున్న మనం, అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాము. మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన తలుచుకుని "ఇక్కడిదాకా రావడానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే" అంటారు. మన విషయం అంటారా మన సమాధులపై తాజ్ మహల్ కట్టకపోయినా ఫర్వాలేదు. కాని మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు. "ఇతను మంచి మనిషండీ. ఇతనేవీ అద్భుతకార్యాలు చెయ్యలేదుకాని, క్రీస్తు మాటలు మాట్లాడాడు. ఆ మాటలే నేను క్రీస్తుని తెలుసుకునేలా చేసాయి."

వసంతం పిలిచింది
రేగడి నేలలో దాగిన
హరిత పత్రాలు వికసించాయి
ఆకుల కింద దాగిన పూలు
తలలెత్తి కిలకిలా నవ్వాయి

ఎన్నెన్ని అందాలు చందాలు
చామంతులు గులాబీలు
కంటికి కనిపించని పుష్పాలు
వెలుతురు పిలిచే సరికి
ఆకుల్ని తొలగించి తొంగిచూసాయి

ఎందరెందరో చేసారు
ఎన్నెన్నో పుణ్యకార్యాలు
ఆకుమాటున విరబూసే
ఆ అందాలను అరసినంతనే
ఆనందించేదెంతమంది?

విరిగి నలిగిన చితికిపోయిన
గుండెల్లో విశ్వాస ప్రేమ పుష్పాలు
పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ
ప్రేమ సరాగాలతో వికసించి
ఆకుమాటున దాగి అందాలీనుతాయి

నీడల్లో చీకటి జాడల్లో
వీధుల్లో శ్రమలవాడల్లో
పూసే పూలు వెదజల్లే
విశ్వాస పరిమళం
పరిశీలనకందని పరమరహస్యం

మన మసక కంటికి అందక
ఉన్న అందాలెన్నో కాదా
పరలోకపు తోటమాలి దిగివచ్చి
దాగిన అందాలను వెలికితీసి
వెలిగిస్తే కనిపిస్తాయి.

అజ్ఞాత వ్యక్తుల్లోనుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు - లూకా 14:23.