Day 123 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్ధన చేయువారందరును రక్షింపబడుదురు (యోవేలు 2: 32).

నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలూ, అంచనాలు వేసుకోవడం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏమిటి?

గమ్యం దగ్గరికి సరళరేఖలో పరిగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటూ, ఇటూ పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరెక్కడో వెదికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి. అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యలు నుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయతను ఆయన నాకిచ్చాడు.

యన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కొనక్కరలేదు. ఎందుకంటే "ప్రార్థన చేయు వారందరును" అనే మాట అంతులేనిది. "వారందరును" అనే దాన్లో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్లు ఎవరైనా, అందరికీ, అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి, వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్ధిస్తాను.

నాకు క్షణాలమీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకనవసరం. వాగ్దానం చేసినవాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు. పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయనకి సలహాలివ్వడానికి నేనెవరిని? నేనాయన బృత్యుణ్ణి మాత్రమే. మంత్రిని కాను. మొర్రపెట్టడమే నా వంతు. విడిపించడం ఆయన పని.