మరణం తర్వాత ఏంటి


  • Author: Praveen Kumar G
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

ఈనాడు ఎక్కడ విన్నా మరణవార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రతీ రోజు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఏదోరీతిగా చనిపోతూనే ఉన్నారు. ఏ రోజు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియదు. ఎక్కడ చూచినా నేరాలు, ఘోరాలు హత్యలు, దోపిడీలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఎవరికి ఏవిధంగా మరణం సంభవిస్తుందో తెలియదు. మరణించేది ఎలాగు తప్పదు. అయితే మరణించాక నేనేమవుతాను అనేది మరో ప్రశ్న! మనకు మరణం ఏ రూపంలోనైనా రావచ్చు. ప్రకృతి రీతిగా మన శరీరం నుండి ఆత్మ వేరై నిత్యత్వంలోకి వెళ్ళి పోతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే కాని ఎవరికీ అంతుబట్టని ప్రశ్న ఏమిటంటే. ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ లోకంలో మన జీవితం తాత్కాలికం, అశాశ్వతం, మరణమనేది మానవ బ్రతుకులో ఒక భాగం, పుట్టుట గిట్టుట కొరకే అయినా మనకెందుకో గిట్టడం అంటే మహాభయం. దానికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మనం ఎంత భయపడ్డా ఎక్కడికి పారిపోయినా మరణం మాత్రం ఏదో ఒక స్థలంలో కలుసుకుంటుంది. అప్పుడు ఈ లోకంలో మన సంబంధం తెగిపోతుంది. ఇది కఠోర సత్యం. ఈ సత్యాన్ని గూర్చి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఏంటో విచారాన్ని, దుఃఖాన్ని కలిగించే ఈ మరణం అంటే ఏంటి?

మనిషికి శరీరం, ఆత్మ రెండూ ఉన్నాయి. హైందవ పరిభాషలో శరీరాన్ని స్థూలరూపమని, ఆత్మను సుక్ష్మరూపమని అంటారు. శరీరం నశిస్తుంది కాని ఆత్మకు చావు లేదు. శరీరం కుళ్ళి పురుగులు పడుతుంది. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. చావు అంటే శరీరానికి, ఆత్మకు కలిగే ఎడబాటు. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడమే మరణం. ఆ తర్వాత శరీరం ఎన్నటికి ఉనికిలోకి రాదు. నిత్యత్వం లో స్వర్గం, నరకం రెండే రెండు స్థలాలు ఉన్నాయి. చనిపోయిన మన పుర్వికులందరు ఈ రెండు స్థలాలలో ఏదో ఒక స్థలంలో ఉన్నారు. నీవు కూడా ఈ రెంటిలో ఏదో ఒక స్థలానికి వెళ్ళాల్సిందే! తప్పదు. దీనిని ఎవరూ మార్చలేరు. సాధారణంగా అందరూ స్వర్గానికి పోవాలని కోరుకుంటారు. స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడ ఉండే దేవుడు ఎలాంటివాడో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ దేవుడు పరిశుద్ధుడు, సత్యవంతుడు, నమ్మకమైన, ప్రేమ, కరుణ, క్షమాపణగుణం మొదలైన మహోన్నతమైన లక్షణాలు కలిగినవాడు. మానవుడేమో స్వాభావికంగా అపవిత్రుడు. అబద్ధం, మోసం, ధనాపేక్ష, స్వార్ధం, అసూయ, పగ, ద్వేషం, కామం, మొహం మొదలైన ఎన్నో పాప సంబంధమైన లక్షణాలు కలిగినవాడు. జన్మ, కర్మ పాపాలకు లోనై యున్నదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి మానవుడు పరిశుద్ధుడును, పరమ పావనుడైన ఆ దేవాది దేవుని దగ్గరకు వెళ్లడం ఎలా సాధ్యం! మిరే ఆలోచించండి! అది సాధ్యం. ఆ దేవునికి మనకు అడ్డుగోడలా ఉన్నా ఈ పాపలు తోలగిపోతేనే ఆ దైవాన్ని మనం చేరుకోగలం.

ఆఫ్రికా దేశస్తుడు తన నలుపు రంగును ఏ విధంగా మార్చుకోలేడో అలాగే మనిషి తన స్వభావాన్ని మార్చుకోలేడు. మత సంబంధమైన కార్యాలు – దానధర్మాలు, జపాలు, తీర్ధయాత్రలు మన హృదయంలోని స్వభావాన్ని మార్చలేవు. ఎన్నో నదుల్లో మునిగినా ఆంతర్యములోని పాపాలు కడగబడవు. అందుకే తాండియా మహా బ్రాహ్మణంలో ఈ విధంగా వ్రాయబడియుంది.

“సర్వ పాపపరిహారో రక్తప్రోక్షమావశ్యకమ్ తత్ రక్తం పరమాత్మేణా పుణ్యదాన బలియాగం”

ఈ శ్లోకం యొక్క అర్ధం పరమాత్ముడైన దేవుడే పున్యదానంగా బలియాగమై ఆ రక్తాన్ని చిందించాలి. కాని జంతువుల రక్తం మనుష్యుల పాపాలను ఎలా తిసివేయగలడు? పవిత్రమానవుని రక్తమే చిందించాలి. మానవులలో పవిత్రులెవ్వరూ లేరు.

ఎన్నో మతాలను కలిగి ఉన్న మన భారతదేశంలో మహాపురుషులు, అవతార మూర్తులు ఎందరో పుట్టారు, గిట్టారు. కాని వేదం చెప్పినట్టుగా సర్వమాంగీకారమైనట్టి బలియాగం ద్వారా మానవాళి పాప పరిహార్ధం తన స్వంత పరిశుద్ధ రక్తాన్ని చిందించిన పరమాత్ముడు వీరిలో ఎవరైనా ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించండి. మనల్ని రక్షించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని, శరీరాన్ని, ప్రాణాన్ని అర్పించిన ప్రేమమూర్తి, త్యాగ శీలి ఎవరో ఒకింత పరిశీలించండి. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఆ విధంగా బలైపోయాడు. ఆయన మనలనెంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయనే మనందరికీ తండ్రి. అనాది సంకల్పమైన తన కృపా రక్షణ ద్వారా పాపులమైన మనలను పరలోక ప్రాప్తులనుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో యే పాపము లేనప్పటికిని మానవులందరి పాప పరిహారానికై తన ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పాడు. చెప్పిన విధంగానే మానవులందరి పాప పరిహార్ధమై రక్తాన్ని, ప్రాణాన్ని సిలువపై అర్పించాడు. మూడవ రోజున చావును గెల్చి తిరిగి లేచాడు. ఆయనే అందరికీ రక్షకుడు. ఆయనలో దైవ లక్షణాలన్ని ముర్తీభవించి ఉన్నాయి. ఆ పరమాత్ముడు కార్చిన పవిత్రమైన, నిర్ధోషమైన రక్తమే ప్రజలందరి పాపాలను తీసివేయగల శక్తి గలది. అప్పుడే పవిత్రుడైన దేవునిని మనిషి చేరుకొనగలడు. మానవ పాప పరిహారానికి, పరలోక ప్రవేశానికి ఇదొక్కటే మార్గం.

ప్రియ చదువరీ, నీ కొరకు రక్తాన్ని చిందించి బలియాగమై పోయిన పరమాత్ముడు యేసుక్రీస్తు తప్ప మరి ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరని గ్రహించిన నీవు రక్షకుడైన యేసును నీవెందుకు స్వంత రక్షకునిగా అంగీకరించకూడదు? ఆయన ద్వారా ఉచితంగా ఇవ్వబడిన రక్షణను ఎందుకు పొందకూడదు? ఆలోచించండి. భయంకరమైన నిత్య నరకం నుండి తప్పించుకోండి. ఇంకా అనేకమైన విశయాలు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ ని నేడే చదువు. ప్రభువు మిమ్ములను దివించును గాక. ఆమేన్.