Day 141 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకోందును (కీర్తన 77: 6).

పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరంమీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రము పాడదు. ఓ కూనిరాగం తీస్తుందేమో గానీ పూర్తిపాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్పపాడదు.

చాలామంది చీకటి అలుముకుంటేనే గాని పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రిళ్లు మాత్రమే వినిపిస్తుంటాయి. "ఇదిగో పెళ్ళికొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి" అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది.

నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఊరడించి సంతృప్తి పరిచే దేవుని అపారమైనప్రేమ అర్థంకాదు.

వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది, ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులోనుంచే వస్తుంది.

నటాలి అనే పదవిబ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్లిన జేమ్స్ క్రిల్ మన్ అనే ఆయన ఇలా రాసాడు.

"అదో మరుపురాని ప్రయాణం, గులాబీ పూల పరిమళంతైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాలనుండే ఎగుమతి అవుతుందని నాకప్పుడే తెలిసింది. ఇక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు.

మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను. వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబి పూలలో నుండి 40 శాతం పరిమళం తగ్గిపోతుందని."