Day 149 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాము (యోహాను 15: 15).

కొంతకాలం కిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్ళలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపి గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు.

ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. చాలా అలిసిపోయినట్టున్నాడు. కానీ ఒక చోట కూర్చుని ఒక గంటసేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు. తర్వాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ని మూసేసి ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు ఇలా అన్నాడు.

"ప్రభువైన యేసు, ఇప్పుడు మళ్లీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా, ఇంకేం గొడవలు లేవు కదా?"

యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం. ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలు లేకుండా చూసుకోవాలి.

క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనలవల్ల, ధ్యానంతో, అనుభవైకవేద్యంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆయన సన్నిధిలో విడవకుండా గడిపేవాళ్లకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు.

మాట్లాడు, వింటాడు ఆత్మ కలుస్తుంది ఆత్మలో చేరుతాడు నీకాయన ఊపిరికంటే చేరువగా