Day 153 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక . . . (రోమా 4:18,19).

దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జిముల్లర్ ని అడిగారు. అతడు ఇచ్చిన సమాధానం మరచిపోలేనిది.

"దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైకమార్గం గొప్ప శ్రమల ననుభవించడమే!" ఆ విశ్వాసయోధుడు జవాబు చెప్పాడు. "భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను" ఇది నిజం. అన్ని ఆశలూ విఫలమైనప్పుడే కదా దేవునిమీద నమ్మకముంచే సమయం వచ్చేది!

ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడంలేదు. ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది. నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు.

"భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి" ఒకవేళ భయమేస్తే, దేవుని వైపు చూస్తూ, "నేను భయపడిన సమయంలోనే, దేవా, నీమీద నమ్మకం ఉంచుతున్నాను" అని చెప్పండి. వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెపుతారు.

అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది.

క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి. కొందరు మనుషుల కన్నీళ్ళు, రక్తం నేలమీద చిందకుండా, వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోకపరంగాగాని, ఆత్మీయంగా గానీ, ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణగానీ, మనుషులకి ప్రయోజనకరమైన పరిశోధనగాని, ఆత్మల్ని మేలుకొలిపే ఉజ్జీవం గానీ కలిగిందా? లేదు. ఇలాటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటినొప్పులు. మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిస్ లూథర్ పడిన శ్రమలు, గడిపిన తృణీకారపు రోజులు ఇలాటివే. దేవుని కృప సంబంధమైన సువార్తను యూదా మతాచారాలనుండి వేరు చేయ్యడానికి పౌలు జీవితమంతా ఒక అంతంలేని ఆక్రోశమే కదా.

భారంతో కృంగిన బేలమనసా
సిలువక్రింద చితికిన మనసా, తెలుసుకో
నీ అపార నష్టమే నీ అంతులేని లాభం
త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి
ఎకరాలనిండా పూసిన పూలన్నీ కలిపితే
ఒకటి రెండు చుక్కల పరిమళమవుతుంది

అలలను రేపే పెను తుపానులే
జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి
మధ్యాహ్నపు టెండలోకాదు,
వర్షం కురిసి వెలిసినప్పుడే
నీలాకాశంలో ఏడురంగుల సొంపు
వంపుగా విరిసి మెరుస్తుంది.