యోహాను సువార్త

  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4

అధ్యాయములు: 21, వచనములు: 879

గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను.

రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం.

మూల వాక్యాలు:

1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.

1:29 ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

6:29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాస ముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

10:10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.

10:27,28 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను

11:25-26 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు

13:35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను .

14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ద్దకు రాడు.

19:30 సమాప్తమైనది

ఉపోద్ఘాతం: యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి రచించబడింది. ఆయన క్రీస్తు అనియు, దేవుని కుమారుడనియు, ఆయన నామమందు విశ్వాసము కలిగిన వారికి నిత్య జీవమనియు మరి ముఖ్యంగా తెలియజేస్తుంది. రెండవ తరం క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా తప్పుడు బోధలను సరి చేస్తూ వారికి సత్య సువార్తను నిక్షిప్తం చేస్తుంది ఈ గ్రంథం. యోహాను యేసు క్రీస్తు-ప్రభువు అనియు, మనుష్యకుమారుడు మరియు దేవుని కుమారుడు అని మరి ముఖ్యంగా తెలియజేస్తూ, క్రీస్తు ఆత్మ ప్రతీ వ్యక్తి పై ప్రభావితం చేస్తుంది అని వివరిస్తాడు.యేసు క్రీస్తు యొక్క బాప్తీస్మము మొదలుకొని మరణ పునరుత్థానము వరకు జరిగిన అన్ని సన్నివేశాలు ఈ గ్రంథం లో లిఖితం చేయబడినవి. ఈ సువార్త లో సువార్తికుడు కేవలం ఏడు అద్భుతాలను తెలియజేస్తూ ఆ ఏడు అద్భుతములు నేనే అని ఆయన ధృడంగా చెప్పిన ఏడు సత్యాలైన క్రీస్తు ప్రరిచర్యను విశ్లేషిస్తాడు. ఈ సువార్తికుని యొక్క గ్రంథం మిగతా సువార్తల కంటే ప్రత్యేకమైనది. కీస్తు ఆరోహణమైన తరువాత ఆదరణ కర్తయును సత్య స్వరూపియైన ఆత్మ ఏ విధంగా సర్వ సత్యమైన పరిచర్యలోనికి నడిపించిందో గమనించగలం. నమ్ముట, సాక్షి, ఆదరణ, జీవం – మరణం, వెలుగు – చీకటి, ప్రేమ అనే పదాలు అనేక మారులు ఈ సువార్తలో కనబడుతుంటాయి.

యేసు క్రీస్తును కేవలం తన జననం నుండే పరిచయం చేయడు కాని ఆది నుండి ఏమై ఉన్నదో ఆ వాక్యం నుండి వివరిస్తాడు. ఆదియందు వాక్యముగా, ఆ వాక్యమే శరీరధారియై, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, మెస్సియగా, ప్రతీవాడు నశించకుండా ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు యేసు క్రీస్తును పరిచయం చేసింది ఈ సువార్త. యేసు క్రీస్తు జీవితములో ఉన్న దైవ స్వభావమును మానవత్వాన్ని వివరించి కాలమునకు సంబంధించిన భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసుకొని ఈ సువార్త రచించెను. యోహాను 3:16 అధికముగా చదవబడినది, అనేకులకు ప్రసంగించబడిన సువార్త వాక్యం ఇది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. అంతేకాదు నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము మొదలగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుట ఒక్కటే మార్గమని తెలియజేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో తాను పొందబోయే ఆ సిలువ మరణము గూర్చి మరియు తాను ఆరోహణమైన తరువాత వారు చేయబోయే పరిచర్య విషయమై వారిని సిద్దపరిచాడు.

యేసు క్రీస్తు తనను గూర్చి దృఢంగా చెప్తూ, జీవాహారము నేనే (6:35,48), నేను లోకమునకు వెలుగై ఉన్నాను(8:12,9:5), నేనే ద్వారమును (10:7,9), నేను మంచి కాపరిని (10:11,14), పునరుత్థానమును జీవమును నేనే (11:25), నేనే మార్గమును సత్యమును జీవమును (14:6), నేనే నిజమైన ద్రాక్షావల్లిని (15:1-5) అను ఏడు సంగతులు ప్రత్యేకముగా వివరించాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే ప్రాముఖ్యమైన సంగతి 4:24 లో గమనించగలం.

సారాంశం: నిజ జీవితంలో పరిపూర్ణమైన పరిచర్య ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా 3:16 తెలియజేస్తుంది. యేసు క్రీస్తు వలే మానవత్వంలో మాదిరికరమై, ఇతరుల పట్ల కూడా అదే జీవితం మనమందరం కలిగి యుండాలి, జీవించాలి. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించి, నిత్యజీవమునకు వారసులమై ఆశీర్వాదములు పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకారకులమయ్యే ధన్యత కలిగి యుండాలి. అట్లు ప్రభువు మీకు సహాయం చేయును గాక. ఆమేన్.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.