తన్నుతాను హెచ్చించుకొన్న మహిళ


  • Author: Mercy Ratna Bai Shadrach
  • Category: Women
  • Reference: Bible Women

తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును (లూకా 18:14) అని బైబిల్ బోధిస్తుంటే, మిర్యాము అనే ప్రవక్త్రి తన్నుతాను హెచ్చించుకొని దేవుని నుండి శాపాన్ని పొందుకుంది (సంఖ్యా 12:1-10).

లేవీ వంశమునకు చెందిన అమ్రాము, యొకెబేదుల ఏకైక పుత్రిక మిర్యాము. మిర్యాము అనగా “పుష్ఠిగల” లేక “బలిష్ఠమైన” అని అర్థం. ఈమె దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేకు, మరియు ప్రధాన యాజకుడైన అహరోనుకు తోబుట్టువు. ఈమె చిన్ననాటి నుండి విధేయత, ధైర్యము, సమయస్ఫూర్తి, దైవభక్తి కలిగిన గొప్ప వివేకవతి. ఫరో రాజు హెబ్రీ స్త్రీలకు పుట్టిన ప్రతి మగ శిశువును సంహరించ సంకల్పించినప్పుడు, పదునాలుగేండ్ల ప్రాయములో నున్న మిర్యాము మూడు నెలల పసిబాలుడైన తన తమ్ముడు మోషేను జమ్ము పెట్టెలో ఉంచి నైలునదిలో విడుచుట ద్వారా తలిదండ్రులకు విధేయత చూపింది. నదీ తీరమున కావలి కాయుటలో బాధ్యత వహించింది. ఐగుప్తు రాకుమార్తెను ఎదుర్కొని, తన తల్లినే ఆయాగా ఏర్పాటు చేయుటలో సమయస్ఫూర్తిని, ధైర్య సాహసాలను కనబరచింది. తన తల్లి ఒడిలోనే బాలుడు ఎదుగుచూ దేవుని దయలోనూ, దైవ జ్ఞానములోనూ ఎదుగుటకు అవకాశం కలిగించుట ద్వారా దైవ భక్తిగల స్త్రీగా ఎంచబడింది. నిర్గమ 2:1-10 చదివి ఈ సంగతులను తెలుసుకోవచ్చు.

మిర్యాముకు వివాహమైనట్లు గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. పెండ్లి కాని స్త్రీలను గురించి పౌలు ఇలా వివరించాడు. పెండ్లికాని స్త్రీయు, కన్యకయు తాము శరీరమందును, ఆత్మయందును పవిత్రురాండ్రయి ఉండుటకు ప్రభువు కార్యములను గూర్చి చింతించుదురు. (I కొరింథీ 7:34) కాబట్టి ఈమె దైవ భక్తిని బట్టి యెహోవా దేవుడు ఆమెను ఇశ్రాయేలీయులకు నాయకురాలుగా నియమించాడు. (మీకా 6:4) ఆధునిక మహిళలమైన మనము కూడా దైవసేవ చేయుటకు వివాహము అడ్డురాదు. దైవ సేవకులను చేర్చుకొనుట, వారికి శారావలె ఆతిథ్యమిచ్చుట. మిర్యామువలే ఉత్సాహ గీతములు పాడుట ద్వారా దేవుని ప్రచురపరచ వచ్చును.

ఇశ్రాయేలియుల సుదీర్ఘ ప్రయాణములో మోషే, ఆహరోనులతో సమముగా పాటుపడి ఓ గొప్ప కార్యాన్ని సాధించిన తొలి మహిళా నాయకురాలు మిర్యాము, ప్రజలంతా ఆమె నాయకత్వాన్ని అంగీకరించారు. ఎర్ర సముద్రములో ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు మోషే గొంతెత్తి నినాదం చేశాడు. (నిర్గమ 15:1) అట్టి తరుణములో స్త్రీ అనే సంకోచం లేకుండా, వయస్సు కూడా లెక్క చేయక తంబుర చేతబూని పంక్తిలో ముందు నిలచి యెహోవాను గానం చేయండని స్త్రీలను పురికొల్పింది. వారు కూడా ఆమె మాటకు విధేయులై చప్పట్లు కొట్టుచూ దేవుని ఘనపరచుచూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

యవ్వనంలో తమ్ముడైన మోషేను కాపాడుటలో విజయం సాధించింది. కనాను యాత్రలో నాయకురాలిగా తన పాత్రను సమర్థ వంతంగా నిర్వర్తించి దేవునికి రాయబారిగా, ప్రవక్త్రిగా తన గౌరవాన్ని నిలబెట్టుకుంది. అన్ని రంగాల్లో సబలవలే వ్యవహరిస్తూ కూడా మిర్యాము తన సహజ దుర్భలత్వాన్ని పోగొట్టుకొనలేదు. మోషే కూషు దేశపు స్త్రీని వివాహమాడిన సందర్భంలో తన అక్కసునంతా వెళ్ళగ్రక్కి హద్దుమీరి ప్రవర్తించింది. మోషేను సాత్వికునిగా ఎంచి అతనితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం, మిర్యాము, ఆహరోనులతో దర్శనాల ద్వారా మాట్లాడడం నచ్చని ఈ స్త్రీ తమ్ముడు రెండో వివాహం, అది కూడా అన్యురాలిని చేసుకోవడాన్ని నిరసించింది. తన ఘనతను చాటుకుంది. గర్వాన్ని అణచి గద్దెలు దింపి గడ్డిమేయించే శక్తి సంపన్నుడైన దేవుడు ఈమె విషయంలో మిన్నకుంటాడా, దేవుని కోపాగ్నికి గురియైన మిర్యాము నాయకత్వాన్ని కోల్పోవడమే గాక, భయంకరమైన కుష్ఠు వ్యాధికి గురియై ఆమె శక్తిహీనమైంది. మధుర గీతాలను ఆలపించిన ఆమె నోటి నుండి అపవిత్రురాలను అని అరిచే పరిస్థితి కలిగింది. ధైర్యశాలియైన నాయకురాలు 6,00,000 జనాంగముకు దూరపర్చడమైంది. ఇన్ని జరిగాక పశ్చాత్తాపంతో నిండిన మోషే నాయకత్వాన్ని అంగీకరించి “నా ప్రభువా” అని తమ్ముని పిలువగా అతడు ఆమెకై దేవునికి మొరపెట్టాడు. మిర్యాము స్వస్థత నొంది దేవుని ఘనపరచింది. ఆమె అతిశయంవల్ల ఇశ్రాయేలీయుల ప్రయాణం ఏడు రోజులు స్తంభించిపోయింది.

సర్వాన్ని కోల్పోయిన నాయకురాలు 100 సం.లు నిండినదై వాగ్ధాన దేశాన్ని చేరకుండానే సర్వ సమాజం మధ్యన మొదటి నెలలో సీను అరణ్యములో కాదేషు వద్ద చనిపోయి పాతిపెట్టబడింది (సంఖ్యా 20:1)