Day 235 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను (హెబ్రీ 11:8).

ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచడమంటే ఇదే. మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు. మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాస సూత్రాలేమిటో తెలుసుకున్నాము. సముద్రం మీద ఏ దారీ కనబడదు. నేల అనే మాటే లేదు. అయినా రోజురోజుకీ ఒక చార్టుమీద మేము ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాము. సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైను గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది. ఇక ఇరవై మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నామన్నది తెలిసిపోయింది. మూడు వేల మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని మాకు తెలుసు.

ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం? అనుదినం మా ఓడ కేప్టెన్ తన పరికరాలను తీసుకుని ఆకాశం వంక చూస్తూ సూర్యుడిని, నక్షత్రాలనూ ఆధారం చేసుకుని ఆకాశదీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు. మానవ నిర్మితమైన దీపాలేవీ అతనికి సహాయపడలేదు.

అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్యచంద్రాదులను చూస్తూ నడుస్తుంది. అంతేకాని తీరం కోసమూ, లైట్ హౌస్ కోసమూ, దారుల కోసమూ చూడదు. కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి, చీకటి ప్రమాదాల్లోకి దారితీసినట్టు కనిపించవచ్చు. కాని మార్గాలను తెరిచేది ఆయనే. అర్ధరాత్రి ఘడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే. కాబట్టి ఈ రోజు మనం ముందడుగు వేద్దాం. మనకు అన్నీ తెలిసినాయని కాదు, నమ్మకముంది గనుక.

మనం ఏదన్నా పని మొదలెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానమంతా మనకళ్ళ ఎదుట ఉంటేనేగాని దాన్ని ప్రారంభించం. అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది. చెట్టున పండిన మామిడి కాయల్లాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటినీ చెట్లనుండి కోసుకోవాలంటే కుదరదు.

"ఆదియందు" అనే మాట వెనువెంటనే "దేవుడు" అనే మాట వచ్చింది. మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది. తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే కాని, తమకు తాము సహాయం చేసుకోలేనిది వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతిసారీ ఆయనమీద ఆధారపడవచ్చు. మనం నడిచివెళ్ళిన దానికంటే దేవునిలో వేచి యుండడమే మనలను వేగంగా గమ్యాని చేరుస్తుంది.

ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది.