యోబు గ్రంథం

  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Aug - Sep 2011 Vol 1 - Issue 6

అధ్యాయాలు : 42, వచనములు : 1070

గ్రంథకర్త : ఎవరో తెలియదు.

రచించిన తేది : దాదాపు 1800-1500 సం. క్రీ.పూ

మూల వాక్యాలు : 1:21

రచించిన ఉద్ధేశం: బైబెల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలలో యోబు గ్రంథం ప్రత్యేకమైనది. ఈ గ్రంథంలో ఓ చక్కటి తత్వశాస్త్రం ఇమిడి ఉంది మరియు నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకు చక్కటి సమాధానం తెలియజేస్తుంది. అంతేకాక నీతిమంతులు శ్రమపడ్డానికి గల కారణాన్ని విశ్లేసిస్తుంది. మానవాళి పై సాతాను చేస్తున్న ఆరోపణలను ఎదుర్కోడానికి యోబు గ్రంథం వ్రాయబడింది. యోబు యొక్క సహనాన్ని చిత్రీకరించి

ఉపోద్ఘాతం: యోబు గ్రంథం హెబ్రీ బాషలో వ్రాయబడిన మొదటి పద్యరాగం. దీర్ఘకాలం జీవించిన యోబు జీవితంలో శ్రమల ద్వారా కలిగిన అనుభూతిని తెలియజేసే ఓ తత్వశాస్త్రం యోబు గ్రంథం. యోబు తన పితరులలాగే దీర్ఘకాలం జీవించి, తన కుటుంబంలో యాజకునిగా వ్యవహరించాడు. ఇశ్రాయేలు సంతానం గూర్చి గాని, యాజకులను గూర్చి గాని వ్రాయబడలేదు, బహుషా వారందరి కంటే ముందే సంభవించి యుండవచ్చు. ఎలీఫజు, ఎశావు జ్యేష్ఠకుమారుడు. దీనిని బట్టి యాకోబు సమకాలికుడని అనుకోవచ్చు. నీతిమంతులకు శ్రమలు ఎందుకు ? మానవాళిపై సాతాను చేస్తున్న నేరారోపణలు ఏవిధంగా ఉంటాయి ? మారుమనస్సు అనగా ఏమి? అనే ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు బోధనాంశాలు.

యోబుకు భార్య, ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. తన కుటుబంపట్ల ఏంటో బాధ్యత కలిగి వారి నిమిత్తం తెలియక తెలిసిన చేసిన పాపాల కొరకు పాపపారిహారం చేస్తూ, ప్రతీ దినం ప్రతి ఒక్కరి కోసం దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఒకనాడు సాతాను యోబు పై ఆరోపణలు చేసి ఎన్నో శ్రమల పాలు చేస్తాడు. అట్టి శ్రమలలో మొదటిగా ఉత్తర అరేబియా ప్రాతం నుండి షెబాయీయులు అనే తెగవారు వచ్చి ఎద్దులు, గాడిదలు పట్టుకొని పోవడం, వాటి పని వారిని హతం చేయడం జరుగుతుంది. రెండవదిగా ఆకాశం నుండి దేవుని అగ్ని గొర్రెలను, పని వారిని, కాల్చివేయడం జరుగుతుంది. తరువాత పారశీక దేశానికి ఉత్తర భాగంలో నివసించే కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి మూడు వేల ఒంటెలను తీసుకొని పోవడం. పనివారిని హతమార్చడం జరుగుతుంది. అటు తరువాత ఓ సుడిగాలి ప్రభావం వాల్ల ఇల్లు కూలి భోజనం చేస్తున్న యోబు కుమారులు, కుమార్తెల మీద పడగా వాడి మంది సంతానం మరణించడం జరుగుతుంది. ఆతి విపత్తుల తరువాత కూడా యోబు దేవుణ్ణి ఎంత మాత్రమును దూషించకుండా ఓ ప్రాముఖ్యమైన సందర్భం ఈ గ్రంథంలో వ్రాయబడియుంది. 1:21 “నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక!.” ఈ మాటలు పలుకక ముందే తన విశ్వాసాన్ని విడువలేదు, దుఃఖాన్ని దాచుకోనలేదు. అయితే తాను మానవ మాత్రుడనని, తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడో అనేది తెలియపరుస్తుంది. సాతాను పెట్టిన పరీక్షలలో తన ఆస్తిని కుటుంబాన్ని పోగొట్టుకున్నాడే గాని, దేవుని దృష్టిలో తన యధార్ధతను మాత్రం పోగొట్టుకోలేదు. ఈ గ్రంథం లో మరి ముఖ్యంగా దేవుడు యోబుకు అనుగ్రహించిన దాని అంతటి మీద ఆయనకు సర్వాదికారం ఉంది అనే సంగతిని వ్యక్తం చేసాడు. చివరిగా తన యధార్ధతను బట్టి యోబును మొదటి స్థితి కంటే దేవుడు మరి బహుగా ఆశీర్వదించాడు అని చూడగలం. “దేవుడు తన ప్రజలకు ఏమి ఇచ్చాడు అని కాదు గానీ, దేవుడు ఏమై యున్నాడు అనే దాని బట్టే ఆయన్ని ప్రేమించగాలం”.

సారాంశం: యోబు జీవిత విధానంలోనే నేటి తలిదండ్రులమైన మనము మన బిడ్డల పొరపాట్లు క్షమించబడు నిమిత్తం, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, వారి భద్రత నిమిత్తం, వారు మన ప్రభవును సంతోషపెట్టే నిమిత్తం జీవింపచేయుమని దేవునికి విజ్ఞాపనలు చేసే వారముగా ఉండాలి. దేవునికి సాతానుకు మధ్య సంభాషణ మనకు నేర్పించే గొప్ప సత్యం ఏమిటంటే, సాతాను మనపై చేసే ప్రయత్నం దేవునికి ముందే తెలుసు, కాని ప్రత్యేకమైన కారణాలను బట్టి అట్టి శ్రమలగుండా వెళ్ళనిస్తాడు. అయితే అట్టి సమయంలో ఆయన ఎంతో కనికరం, దయ, జాలి చూపించేవాడుగా ఉంటాడు. కొన్ని సార్లు మన పరిస్థితిని బట్టి, దేవుడు మనకు చాలా దూరంలో ఉన్నాడేమో, మనల్ని ఏమీ పట్టిచ్చుకోవడంలేదేమో అనిపిస్తుంది. ఇక దేవుని భద్రత కాపుదలపై ఎన్నో అనుమానాలు మొదలవుతాయి. అయితే అతివంటి సమయాలల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించాలి. మనం దేవున్ని తెలుసుకొని నమ్ముకొని, సేవిస్తున్నాం అంతే, ఆయన ఎవరై యున్నాడో దానిని గుర్తెరిగేగాని, ఆయన్ని మనం ఎలా ఊహించుకుంటున్నామో దాన్ని బట్టి కాదు. మన దేవుడు బాధలలో చూస్తూ ఊరుకునేవాడు కాడు. నిజానికి మన సమస్త బాధలలో సహాను భావము కలిగినవాడు. కాబట్టి మన బాధలన్నీ అర్ధం చేసుకొనగలిగిన వాడు, తన సహాయాన్ని అందించి ఆనందింపజేస్తాడు. పరిస్థితిని బట్టి శిక్షకు అనుమతించినా తిరిగి ప్రేమించి తన మంచితనాన్ని కనుపరచేవాడు. అట్టి మంచి దేవుని నుండి ఎట్టి పరిస్థితిలో దూరం కాక, ఆయన్నే వెంబడిస్తూ, ప్రేమిస్తూ ఆయనపైనే ఆధారపడి, ఆనుకొని జీవించాలి. సాతాను మన పై ఎన్ని కుతంత్రాలు పన్నినా విశ్వాస కర్తయైన దేవుడు మనలను ఎన్నడు విడువడు ఎడబాయాడు. తన కృపను ఇంకనూ విశాలపరచి భద్రపరుస్తాడు. నమ్ముట నీ వలననైతే సమ్మువానికి సమస్తం సాధ్యం. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.