Day 319 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అత్యధిక భారమువలన కృంగిపోతిమి (2 కొరింథీ 1:8).

క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము... (2 కొరింథీ 12:9).

పెనూయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపులనుండీ ఆపదలు అతణ్ణి చుట్టుముట్టేలా చేశాడు దేవుడు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకొనేలా అతణ్ణి చెయ్యాలనే దీన్ని జరిగించాడు. ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోను, దేవుని గురించిన జ్ఞానంలోను విశారదుడైనాడు. విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు.

దేవుడు దావీదును బలవంతం చేశాడు. తన దేవుని విశ్వాస్యతను, అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం, పరిశుద్దత మొదలైన దివ్యసూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతనిని అంతులేని క్రమశిక్షణకు గురిచేశాడు. ఇశ్రాయేలుకు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం మరి.

పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికీ, అతని ద్వారా సంఘాలకీ "నా కృప నీకు చాలును" అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించ గలిగాయి.

మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవీ దేవుణ్ణి ఇంతగా తెలుసుకొనేలా చెయ్యగలిగేవి కావు. ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా, ఆయననుండీ ఇంత కృపను పొందగలిగేలా చెయ్యగలిగేవి కావు. అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి.

ఆటంకాలు, బాధలు మన విశ్వాసంవైపు దేవుడు విసిరే సవాళ్ళు, మన విధి నిర్వహణలో ఆటంకాలేర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని, పరిపూర్ణతను నింపాలి. ఆయనమీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురుకావచ్చు. ఓర్పు అవసరం కావచ్చు. కాని ఎట్టకేలకు ఆ అడ్డుబండ తొలగిపోతుంది. మనం ఎదుర్కొన్న అగ్నిపరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండింతల దీవెనలు ఇవ్వడానికి దేవుడు ఎదురుచూస్తూ కనిపిస్తాడు.