Day 334 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ??????? ?????????

నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను (యిర్మీయా 45:5).

ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం. కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్యదినాల్లో, శ్రమదినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణ నిస్తుంది.

"దోపుడు సొమ్ము దొరికినట్టుగా" ప్రాణం దొరకడం అంటే ఏమిటి? అంటే నాశనకర్త కోరల్లోనుండి లాగేసుకున్న ప్రాణమన్నమాట. సింహం నోటిలోనుంచి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టన్నమాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, గాని యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుపానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట, అస్తమానమూ మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముల్లు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది "దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చేయ్యి"

పదలనుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కాని ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం. ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి. నలభై పగళ్ళూ, రాత్రుళ్ళూ యేసుప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలిదప్పుల మూలంగా ఇంకా నీరసమై పోయింది.

అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది. కాని హెబ్రీ యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. ఆ రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతణ్ణి బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు. ఎందుకంటే తన దేవునిమీద అతడు నమ్మకముంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు. అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు.