Day 346 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితీని, విశ్వాసము కాపాడుకొంటిని (2 తిమోతి 4:6,7).

సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్దాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లోనుంచి నడిపించిన దానిని గురించీ చెప్పుకుంటాము. ధవళవస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి ఇతడు తప్ప మిగిలినవాళ్ళంతా మహా శ్రమలకాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్నవాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటుగదా?

నీ సంగతేమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్దుడు ఇడుగో అని నీవైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకు ఇష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరినౌతావు. పోరాటంలో పాల్గొనాలి. ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది.

పర్వతం మీద యుద్దంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టరు అడిగాడు "నీకు గాయం ఎక్కడ అయింది?" ఆ సైనికుడు జవాబిచ్చాడు "శిఖరం పైన. "తన శరీరం పైనున్న గాయం మాటే మర్చిపోయాడతను. పోరాటమే గుర్తుంది. తాను కూలిపోయిన చోటే గుర్తుంది. తమ గెలుపే గుర్తుంది. క్రీస్తుకోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. "శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తిచేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను" అంటూ సింహనాదం చేద్దాము.

నీ పని సంపూర్ణం చెయ్యి
ఆపైన విశ్రమించు
విశ్రాంతి దేవుడిచ్చేదే
ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు
దేవుడు నీ దగ్గర పతకాలూ,
డిగ్రీలూ ఉన్నాయా అని చూడడు
నీ గాయపు మచ్చల్ని చూస్తాడు.

ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం

అతని వీరఖడ్గానికి
అలంకారాలేం లేవు
అన్నీ గంట్లు తప్ప

సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు.