ఐక్యత కేవలం విశ్వాసము ద్వారానే కలుగుతుంది

  • Author:
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

యేసు క్రీస్తు ప్రభువు సిలువకు అప్పగింపబడక ముందు, మేడ గదిలో తన శిష్యులను ఓదారుస్తూ తాను ఎట్టి శ్రమ అనుభవింపబోవునో ముందుగానే వారికి బయలుపరుస్తూ మరియక్రీస్తు మరణ సమయమున వారికి కూడా ఎట్టి శ్రమలు సంభవించునో తెలియజేసెను.

ఎట్టివి సంభవించినా క్రీస్తునందు నిలిచియుండుమని, విశ్వాసమును కాపాడుకొనుటలో జాగరూకులై యుండుమని, సువార్త నిమిత్తం లోకమునకు తన శిష్యులుగా బయలు పరచుకొనుమని ఆజ్ఞాపించాడు. ఇట్టి విషయాలను వివరించుటకు ద్రాక్షావల్లికిని మరియు తీగలకును పోల్చి చెప్పెను.

నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు అని సంబోధించటములో క్రీస్తు తనను గూర్చి మరియు తన సంఘమును గూర్చి తెలియజేస్తున్నాడు. ఆయన మరియు అయన ప్రజలు ఒకే చెట్టుకు లేదా మొక్కకు మరియు ఒకే జీవమునకు చెందినవారమని అర్ధం. అనగా సంఘము శరీరమైతే క్రీస్తు ఆ శరీరమునకు శిరస్సు. క్రీస్తు ద్రాక్షావల్లి, దానికి ఆనుకొనియున్న తీగెలు తన ప్రజలు, తన సంఘం.

క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లిగా జేయుటకు ఈలోకానికి అవతరించాడు. ఎందుకనగా క్రీస్తు ద్వారానే సమస్త జీవం, శక్తి మరియు తన ప్రజలకు రక్షణ. ద్రాక్షాతోటలో ద్రాక్షావల్లి ముఖ్యమైనది. అయితే ఈ ద్రాక్షావల్లి స్థిరంగా మొక్కకు నిలబడాలి అంటే అందు తీగల సహాయం ఉండాల్సిందే. ద్రాక్షాగెల కలిగిన మొక్కకు తీగలు ద్రాక్షావల్లిని ఆధారము చేసుకొని యుండకపోతే ఏమి ప్రయోజనం, వాటిని వ్యవసాయకుడు పెరికివేస్తాడు. ఎప్పుడైతే ఆ తీగలు ఆధారం చేసుకొని ఉంటాయో అప్పుడే ద్రాక్షావల్లి స్థిరంగా ఉంటుంది.

ఇదేవిధంగా, ఆత్మీయంగా, పరిశుధ్ధంగా ఆయన యందు ఆధారపడతారో వారికే జీవము మరియు అట్టి రక్షణ లేని యెడల పెరికివేయబడుదురు. క్రీస్తుకు వేరుగా ఉండి ఏమియు చేయలేము. ఆయనయందు నిలిచియున్న వారమైతే శ్రమ వచ్చినా, సమస్య ఎదురైనా, ఉపద్రవము పొంచియున్నా తన కృప మనలను విడిచిపోదు.

ఈ ఐక్యత కేవలం విశ్వాసము ద్వారానే కలుగుతుంది. ఆమేన్.