జక్కయ్యను నేనైతే

  • Author: ???? ???? ???????
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

ధనవంతుడే కావచ్చు
పొట్టివడే కావొచ్చు
సుంకం వసూలు అతని వృత్తి

ఎప్పుడు విన్నాడో
ఏమి విన్నాడో
యేసు ఎవరోయని చూడగోరి
లోలోపల రగిలింది ఆశ

యేసును చూడటమంటే
సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని కనుగొన్నట్లే
వెలుగును ప్రకాశింపచేసుకున్నట్లే
ఇక జీవితం మునుపున్నట్లే ఎందుకుంటుంది?

ఓ రోజు
ఆరోజు రానేవచ్చింది
తను నడకనేర్చిన దారుల్లో
నడచిన వీధుల్లోకి
యేసు నడచిరావటం
వెలుగును వెంబడించేవారిని తోసుకుంటూ
చూడటం కష్టమైయ్యింది
పైగా పొట్టివాడాయే!

అందుకే ! పరుగు
ఆశను నెరవేర్చుకునేందుకు అన్వేషణ

కష్టమైనా
కాళ్ళు మనసు మేడిచెట్టు ఎక్కించాయి

దగ్గరగా వస్తున్న
రక్షకుణ్ణి చూస్తుంటే సంబ్రమాశ్చర్యాలే

"త్వరగా దిగుము
నేడు నీ ఇంట వుండవలసింది" అనే పిలుపు
జీవితానికది మలుపు
సంతోషం కమ్మిన దేహం
మారు మాట్లాడదుగా!

ఆయనను చేర్చుకొనగానే
ఊహించని మార్పు
ఎంత మార్పంటే
ఇతరులు అసూయపడేంత!
గుసగుసలాడుకునేంత!

మార్పు అంతరంగంలోనూ
ఎంత మార్పంటే
కూడగట్టిన ఆస్తిలో భాగాన్ని
తేలిగ్గ బీదలకిచ్చేయగలిగినంత
.
పేరుకున్న అపరాధభావాన్ని కడిగి
అన్యాయానికి
నాల్గింతలు చెల్లించ గలిగినంత!

మార్పును గమనించి
ఇతడూ అబ్రహాము కుమారుడేయని
రక్షణ వస్త్రాన్ని కప్పాడు యేసు.

జక్కయ్యను నేనైతే !!