క్రీస్తుతో 40 శ్రమానుభవములు 1 వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. 1 పేతురు 4 : 12

క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసాన్ని మధ్యలోనే వదిలేసినవాళ్లు అనేకులు ఉన్నారు. ఆ శ్రమను దాటడానికి వ్యక్తిగత నిర్ణయాలతో కూడిన మార్గాలను వెతుక్కుంటారు. కాని ఆ అనుభవంగుండా వెళ్ళడానికి ప్రయత్నించరు.

అయితే ఎటువంటి శ్రమ వచ్చినా, అగ్నివంటి శ్రమ కలిగినా, అది చివరకు మరణమైనా లెక్కచేయనివాళ్ళు కొందరుంటారు. వీరే దేవునికి కావలసినవాళ్లు.

- క్రైస్తవుడు అగ్నివంటి శ్రమలద్వారా పరీక్షించబడుతాడు. ఇదేమి వింత కాదు అని పేతురు వివరిస్తూ, ఈ శ్రమ "క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని పరీక్షించడాన్ని సూచిస్తుంది" అని జ్ఞాపకము చేస్తున్నాడు.

- బంగారము కొలిమిలో వేయబడినప్పుడు, మలినము మష్టు అగ్నిలో కాల్చివేయబడి శుధ్ధమైన మేలిమైన బంగారంగా తయారవుతుంది. అలాగే శ్రమాలగుండా ప్రయాణిస్తున్నప్పుడు మన విశ్వాసము పరీక్షించబడి పరిశుద్ధమైన వారముగా రూపాంతరమెందుతాము .

- అనేకరకములైన శ్రమ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో... బాధలు, నిందలు, అవమానాలు మరియు సామాజిక బహిష్కరణలను ఎదుర్కోవాల్సివస్తుంది. ఈ శ్రమానుభవంలో మారణాన్ని కూడా లెక్క చేయని హతసాక్షులు క్రీస్తుకు మరింత దగ్గర చేరుకునే అనుభవాన్ని పొందారు. ఇట్టి శ్రమలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు ఇది దేవుని చిత్తం.

- శ్రమలు మనలను క్రీస్తులో మరింత బలపరచబడటానికే గాని కృంగదీయడానికి కాదు. అగ్నివంటి శ్రమలు చివరకు మరణానికి దారితీసినా క్రీస్తును చేరుకుంటామనే నిరీక్షణను పెంపొందింపజేస్తుంది.

- శ్రమలో సహనం బలపరచబడాలి. అంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చయత కలుగచేస్తుంది. ఆయనతో మనము కలిగియున్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయములను అందులోని వేదననుండి స్వస్థత కలుగజేస్తుంది.

గనుక దేవుడు... మనకు కలిగే ప్రతీ వేదనలోను, మనము పొందే ప్రతి శ్రమలోను మనకు తోడై ఉంటాడనే నమ్మకం మనకుంటే విశ్వాసములో మరింత బలము పొందగలము.

అనుభవం : నీతిమంతుడుగా తీర్చబడాలంటే క్రీస్తుతో శ్రమపడిన అనుభవం కావాలి.