క్రీస్తుతో 40 శ్రమానుభవములు 13వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఫిలిప్పీ 1:30

2016 లో జరిగిన ఒక వార్త విన్నాను. జపాన్ దేశంలో హోక్కైడో అనే ప్రాతంలో క్యూ-షిరాతక్కి అనే రైల్వే స్టేషనులో రోజు ఉదయం, సాయంత్రం కేవలం ఒక స్కూలకు వెళ్లే చిన్నారి కోసం ప్రభుత్వం వారు మరియు రైలు సిబ్బంది సేవలందించాలని నిర్ణయం తీసుకున్నారు. అనేక సంవత్సరాలు ఎంత ఖర్చైనా, ఎంత భారమైనా భరించి ఆ చిన్నారి భవిష్యత్తుకొరకైన ఆలోచన కలిగియుండడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

అనేకమైన నిర్ణయాలు చిన్నవిగా అనిపించినా వాటి పరిమాణం చాలా పెద్దవిగా ఉంటాయి. దేవుడు మననుండి కోరుకునేది కూడా ఇదే.

క్రీస్తు కొరకైన మన నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రతిఫలం ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుందని గమనించాలి.

"బ్రదుకుట క్రీస్తే చావైతే లాభము" అని అపొస్తలుడైన పౌలు ఒక నిర్ణయం చేసాడు. క్రీస్తు కొరకైన ప్రతి శ్రమను జ్ఞాపకము చేస్తూ... తానున్న స్థితినిబట్టి కాక, క్రీస్తు విషయము వలనైన బంధకాల వలన పొందిన శ్రమానుభవమును గూర్చి ఫిలిప్పీ సంఘానికి వివరిస్తున్నాడు.

ఈ నిర్ణయం కేవలం క్రీస్తును విశ్వసించుట వలన పొందే శ్రమనే కాదు గాని, క్రీస్తు పక్షమున శ్రమపడే అనుభవంలోకి మార్చేసింది.

ఈ మాటలు ఆనాడు ఫిలిప్పీ సంఘాన్నే కాదు, ఈనాడు మనలను మన సంఘాలను కూడా బలపరుస్తున్నాయి.

స్నేహితుడా! తొంబది తొమ్మిది గొఱ్ఱెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒకే ఒక్క గొఱ్ఱెపిల్లను వెదకగలిగే కాపరి వంటి వారు కావాలి. ఒక్క ఆత్మనైనా రక్షించాలనే పట్టుదల కలిగి ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రయాస పడే సువార్తికులు కావాలి.
వేసే ప్రతి అడుగు చిన్నదైనా, ఓర్పుతో వేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం కావాలి.

ఈ ఉద్దేశాలు కలిగినవారు క్రీస్తు విషయములో కలిగే శ్రమలను బట్టి కాక, క్రీస్తు పక్షమున శ్రమానుభవమును పొందగలుగుతారు.

అనుభవం:
విశ్వాసము లోకములో శ్రమలపై పోరాటాన్ని జరిపితే, క్రీస్తు శ్రమానుభవములు మహిమన్విత కిరిటం ధరింపజేస్తాయి.