క్రీస్తుతో 40 శ్రమానుభవములు 14వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:11

ఈ లోక సంబంధమైన ఆస్తి - అంతస్తులు, పేరు - ప్రఖ్యాతులు ధనాపేక్షతో ముడిపడే ప్రతి కార్యము చివరకు నష్టమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వీటిని విడిచి దేవునిపై ఆధారపడే జీవితాలే క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండే అనుభవాలు. ఇక్కడ ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాను.

ఈ లోకపు ఆస్తి మాకొద్దని అపొస్తలులు తమ్మును తాము క్రీస్తు శ్రమల విషయములో పాలుపంపులు కలిగి స్వస్థతా వరములు పొందగలిగారు.

మోషే ... ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకున్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడు. "దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు" అనే సాక్ష్యం పొందగలిగాడు. ప్రతి శ్రమానుభవములో అద్భుతాలు చేయగలిగాడు.

సౌలు పౌలుగా మార్చబడినప్పుడు, "నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని; నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమని" క్రీస్తు కొరకైన శ్రమల కొరకే దేవుడతనిని ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తమైన శ్రమలలో పాలివాడగుటకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. దేవుడు అతని పరిచర్యను అభివృద్ధి చేశాడు.

ఆత్మీయత లేకుండా, పరిశుద్దాత్మ నింపుదల లేకుండా, ధనవ్యాపారములతో సంఘాలను నిర్మించాలి, అభివృద్ధిపరచాలనే ఆలోచలున్న లవొదికయ సంఘాన్ని; నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవుగా కనబడుతున్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు.

సేవకుడా, ధనం సంపాదించుకోవాలని, ఆస్తులు సమకూర్చుకోవాలనే సువార్త స్వస్థతా పరిచర్యలు అభివృద్ధిలో పరిగెడుతున్నా; సంఘం ఎత్తబడుటకు సిద్ధంగా లేదని గ్రహించాలి.

ప్రతి క్రైస్తవునికి క్రీస్తు కొరకైన శ్రమ భరించే అనుభవం కావాలి. క్రీస్తుతో శ్రమను అనుభవించాలంటే సమస్తమును నష్టపరచుకునే సాహసం చేయాలి. అప్పుడే దేవుని ప్రణాళికలతో చెసే ప్రతి పరిచర్య అభివృద్ధి చెందుతుంది. ఆత్మలకొరకైన ఆ భారం చివరకు ఎత్తబడే గుంపులోకి చేర్చబడుతుంది.

అనుభవం:
క్రీస్తుతో శ్రమ అనుభవం అంటే సమస్తమును నష్టపరచుకొనే సాహనం.