క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ రోజు:

నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. 2 తిమోతికి 2:9

మనస్సొక రణరంగం
మరుగును ప్రతిక్షణం
ఆరాటాల గమనంలో
అనుక్షణమొక పోరాటం
జీవన మరణాల మధ్య అనుభవం
సిలువను వీక్షిస్తే సమాధానం

సంకెళ్లతో బంధించబడి అన్యాయపు అహంకారాలు సంతవీధుల్లో నిలబెట్టినా, అడుగు ఆపితే శరీరాన్ని కోస్తున్న కొరడా కెరటాలు బాధను రెట్టింపు చేస్తున్నా, మరణంవైపు వేసే ప్రతి అడుగు మన జీవితాల్లో చీకటిని చీల్చే కొత్త వెలుగు దిశలుగా, సువాసనపు పరిమళాలను వెదజల్లిన ఆ సిలువ శ్రమానుభవమే సువార్త!

సమూల మార్పే లక్ష్యంగా నశించిపోయే మన జీవితాలను వెదకి రక్షించాలనే ప్రధాన సంకల్పం సిలువ పోరాటాన్ని స్వీకరించి...
సామాజిక, రాజకీయ, ఆధునిక వ్యవస్థలో తాను అంతర్భాగమని ...సగర్వంగా ప్రకటించుకున్న విస్ఫోటనలోంచి ప్రజ్వరిల్లిన అగ్ని జ్వాలలే సువార్త.

అసమానతలు - అణచివేతలను పటాపంచలు చేసి,
అజ్ఞానాన్ని - అంధకారాన్ని తరిమివేసే పాప బంధకాల విడుదలపు తాళపు చెవి సువార్త అని గ్రహించిన జీవితాలు వాస్తవరూపం ధరించిన ఈ వర్తమానంలో, విశ్వాసులపై అపవాది చేస్తోన్నయుద్ధంలో సువార్త ధ్వజం క్రీస్తు రాకడ సిధ్ధపాటు కొరకు పరుగులు తీస్తుంది.

నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపుతూ, వాటి బహుముఖ రూపాలను వెలికి తీస్తూ, వాటితో తలపడుతూ, ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్ది, జీవితాల మార్పు దిశగా సాగడమే.. సువార్త గమ్యం.

సువార్తను ప్రకటించే ఆసక్తి నీకుంటే!
బంధించే బంధకాలను బద్దలకొట్టి
ఆహ్వానించే ద్వారాలు తెరువబడుతాయి.

ఓపికతో పనిచేసే సాధనంగా నిన్ను నీవు సమర్పించుకో!

అనుభవం:
చీకటిని చీల్చే కొత్త వెలుగు రేఖల పరిమళాలు వెదజల్లిన క్రీస్తు సిలువ శ్రమానుభవమే సువార్త!