అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము 2 తిమోతి 4:5
పాడి పరిశ్రమ చేసే ఒక పేద కుటుంబంలో పుట్టి, అనుదినం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా; అందరిలాగే క్రమశిక్షణతో కుమారుణ్ణి పెంచి పెద్దచేశారు తలిదండ్రులు.
దేవునిపై పూర్తిగా ఆధారపడే ఆ కుటుంబం అతనిలో దేవుని జ్ఞానాన్ని, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రయోజకుణ్ణి చేశారు. పరిశుద్ధ గ్రంథం వారి ఆయుధం, ఏవిధమైన సమస్యనైనా ఎదుర్కోడానికి ప్రార్ధనే వారి పనిముట్టు.
మెలిపెట్టే శ్రమలు ఎదురై... నిస్సహాయస్థితిలోకి, దారిద్ర్య పరిస్థితుల్లోకి దారి తీస్తున్నా, నిరంతరం సమాధానపరచే దేవుని నిబంధన వారితో ఉన్నదనే నమ్మకం అతనిలో రెట్టింపైంది.
యవ్వన వయసులో ఏ విశ్వాసం తీర్మానించుకున్నాడో, ఎట్టి సిలువ శ్రమ తెలుసుకున్నాడో, అట్టి కలువరి ప్రేమ అనేకులకు తెలియజేయాలనే సువార్తవలనైన ఆ పట్టుదలతో ఆనాడు అమెరికా దేశాన్నే కాదు, ప్రపంచ దేశాలను క్రీస్తు సువార్తతో గడగడలాడించారు. క్రీస్తు సిల్వలోని ఔన్నత్యాన్ని వివరించగలిగారు ప్రపంచ దేశాల ప్రముఖ సువార్తికుడు బిల్లీ గ్రాహం.
క్రీస్తు సిలువను తెలుసుకున్న జీవితాలు రూపాంతరం చెందుతాయనే ఆలోచనలతో ప్రపంచమంతా ప్రయాణించి ఘన సువార్తను ఘణనీయంగా ప్రకటించారు. 210 బిలియన్ల మంది ఆయన బోధనలు విన్నారు. 77 మిలియన్ ప్రజలు ఆయన్ను స్వయంగా కలుసుకున్నారు. ఆయన జీవిత కాలంలో 185 దేశాలు పర్యటించారు.
నేనంటాను, సువార్త పరిచర్య మన జీవితాల్లో ప్రత్యామ్నాయం కాదు, అది క్రైస్తవుని జీవితం. గొప్ప చర్చి అంటే వేలమంది కూర్చునే కుర్చీలు కాదు, సువార్తికులను సిద్ధపరచి పంపే సామర్ధ్యం.
ఓ క్రైస్తవుడా, నశించిపోయే ఆత్మలను సంపాదించాలనే పట్టుదల నీకుంటే సువార్తికుని పనిచేయి, దానిని సంపూర్ణంగా జరిగించు.
ఓపికతో పనిచేసే సిలువ సాధనమై
రెండంచుల ఖడ్గమే నీ ఆయుధమై
క్రీస్తు శ్రమానుభవ సౌరభాలు వెదజల్లు,
శాంతి సమాధానాలు నీ స్వంతమే.
క్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడనే నమ్మకంతో అడుగు ముందుకువేద్దాం.
అనుభవం:
పరలోక రాజ్యాన్ని విస్తరించాలనే సువార్తికుని పట్టుదల
సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం