క్రీస్తుతో 40 శ్రమానుభవములు 23వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 23వ రోజు:

(క్రీస్తు) తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. హెబ్రీయులకు 2:18

శోధనలు ఎదురయ్యేది మనలను కృంగదీయడానికి కాదు గాని, ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళడానికే.

శోధనలు పరీక్షలు మన ఆత్మీయ స్థితిని బలపరీక్ష చేస్తుంటాయి. శోధలను జయించాలంటే శోధకునితో యుద్ధం చేయాలి. శోధనపై పోరాటంలో విజయం పొందాలంటే ప్రార్ధన అనే ఆయుధం కావాలి.

ఎప్పుడైనా గమనించారా! పక్షిరాజు సర్పముతో నేలపై పోరాటం చేయదు. అది దానిని ఆకాశంలోకి ఎత్తి యుద్ధ మైదానాన్ని మార్చేస్తుంది, ఆపై ఆకాశంలోకి విడిచిపెట్టేస్తుంది. సర్పానికి గాలిలో సత్తువ ఉండదు, శక్తి ఉండదు చివరకు ఆధారం కూడా దొరకదు. భూమిపై ఉన్నట్లు తెలివిగా, బలంగా ఉండక నిస్సహయమైన స్థితిలో పనికిమాలినదిగా మారిపోతుంది.

ప్రార్థన ద్వారా మీ పోరాటాన్ని ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్లండి. ఆధ్యాత్మికంగా మీరున్నప్పుడు దేవుడు మీ యుద్ధాలను అందుకుంటాడు. శత్రువుకు అనువైన యుద్ధభూమిలో మీరు పోరాడవద్దు, పక్షిరాజువలె యుద్ధ రంగాన్ని మీకు అనువుగా మార్చి మీ హృదయపూర్వక ప్రార్థన ద్వారా దేవునిని పోరాడనివ్వండి. ప్రతి విధమైన శోధనను జయించడం సుళువవుతుంది.

గెత్సేమనెలో క్రీస్తు చేసిన ప్రార్ధన అనుభవం సిలువలో శోధనలపై ఎట్టి విజయాన్ని పొందిందో జ్ఞాపకము చేసుకుందాం.
"మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి తప్పించుము" అనే అనుదిన ప్రార్ధనతో శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుటకు ప్రయత్నిద్దాం.

అనుభవం:
సిలువలో శోధనలపై సంపూర్ణ విజయం క్రీస్తు శ్రమానుభవంలో రెట్టింపు ఉత్సాహం.