క్రీస్తుతో 40 శ్రమానుభవములు 25వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను. హెబ్రీయులకు 13:12

అనాదిలో ప్రవక్తల ద్వారా అనేక రీతుల్లో మాటలాడిన దేవుడు, అంత్య దినములలో తన కుమారుని ద్వారా మనతో మాటలాడుతున్నాడు.

ఇశ్రాయేలీయులతో మనం సహపౌరులం కాకపోయినప్పటికీ తన వాగ్ధాన నిబంధనను క్రీస్తులో నెరవేర్చి నిత్య జీవానికి వారసులుగా చేయాలనే నిత్య సంకల్పం... దేవుడు తన కుమారునికి సార్వభౌమాధికారాన్ని ఇచ్చి ఘనపరచి సృష్టంతటిని క్రమపరచమని ఉద్దేశించాడు.

అయితే,
సర్వ సృష్టిపై అధికారం తనకున్నా
తల వాల్చుకోడానికి కూడా స్థలం లేకపోయింది.
ఆయన మూలంగా లోకం కలిగినా
చివరకు ఆయనెవరో కూడా తెలుసుకోలేకపోయింది.

"సర్వాధికారాన్ని" సమాజంముందు మౌనంగా నిలబెడితే
"సిలువ వేయాలి" అనే ఆధిపత్య అహంకారం
చివరకు గవిని వెలుపటకు నెట్టివేసింది
మరణ శాసనం రాసింది.

పాప పరిహారార్థబలి పొందాలంటే
దహనబలి పాళెము వెలుపటేనన్న ధర్మశాస్త్రాన్ని,
స్వేచ్ఛా సంకల్ప సమర్పణగా
తన శరీరాన్ని దహనబలిగా అర్పించాడు.
ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు.

పొందే ప్రతి శ్రమ ప్రజా శ్రేయస్సు కొరకేనని,
ప్రజలందరు పరిశుధ్దపరచబడాలంటే
స్వరక్తం చిందించబడాలనే నిర్ణయం
ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు
సిలువలో మూల్యం చెల్లించాడు.

అనాదిలోని ఆయన నిత్య సంకల్పం,
మహిమలో మనమాయనను చేరుకోవాలనే తండ్రి చిత్తం.
సిలువలో క్రీస్తుతో నెరవేర్చబడింది
మన జీవితం పరిశుధ్ధపరచబడింది.

హల్లెలూయ!

అనుభవం:
మన పాపాలకు తగిన మూల్యం చెల్లించడానికి అర్పించుకున్న క్రీస్తు శ్రమానుభవం మన జీవితాన్ని పరిశుధ్దపరుస్తుంది.