క్రీస్తుతో 40 శ్రమానుభవములు 27వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను. యాకోబు 5:13

ప్రార్ధనా వీరుడైన మిషనరీ - హడ్సన్ టైలర్. ప్రార్ధనలో గొప్పతనాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ "క్రీస్తు సిలువ శ్రమలను వేదనలను అనుభవించుటకు భయపడక ఆయన సేవ చేయుటకు ఎడతెగక ప్రార్ధిస్తూ, శ్రమిస్తూ కృషి చేస్తూ ముందుకు సాగాలి" అన్నాడు.

అవును, దేవుని ద్వారా మనుషులను కదిలించే శక్తి కేవలం ప్రార్ధనకు మాత్రమే ఉంది. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను అని యేసుక్రీస్తు అనేకసార్లు మనకు బోధించారు.

క్రెస్తవుని విశ్వాస ప్రయాణంలో ప్రార్ధన అనేక రీతులుగా సహాయపడుతుంది. లౌకిక జీవితంలో శ్రమలు - ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు; వీటిని ఎదుర్కోవాలన్నా, అధిగమించాలన్నా మనం చేయగలిగినదల్లా ప్రార్ధనే.

ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.

మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్ధన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన అద్భుత శక్తి ప్రార్ధన.

నేనంటాను, పార్ధించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారులేరు కదా!

హన్నా ప్రార్థించి సమూయేలును పొందింది.
హాగరు ప్రార్థించి నీటిని సంపాదించుకుంది.
సొలోమోను ప్రార్థించి జ్ఞానాన్ని పొందాడు.
యేసయ్య తన తండ్రిని అడిగి సర్వకార్యాలు జరిగించాడు.
ప్రార్థన సువాసనగలది. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అట్టి పరిమళ ప్రార్థన జీవితాలు మనకు చాలా అవసరం.

అంతేకాదు, క్రీస్తు శ్రమానుభవములలో ప్రార్ధన సమర్పణ కలిగిన జీవితాన్నిస్తుంది. "తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక" అని యేసుక్రీస్తు సిలువ శ్రమ కొరకు "ప్రార్ధన, సమర్పణ, సిధ్ధపాటు" కలిగియున్నాడని గ్రహించాలి. ఈ అనుభవం ప్రార్ధనలో మనల్ని మరింత బలపరుస్తుంది.

అనుదినం ప్రార్ధన జీవితాన్ని కలిగియుండడం ఎంత ఆశీర్వాదకరం!

ప్రపంచ దేశాలను గడగడలాడించే కరోనా మహమ్మారిని కూడా జయించడం కేవలం ప్రార్ధనతోనే సాధ్యం. రాబోయే రోజులు స్వయంశిక్షణ కలిగి, శక్తివంతమైన ప్రార్ధనతో ఈ తెగులును తరిమికొట్టి, రాబోయే తరాలకు ఒక అనుభవాన్ని నేర్పిద్దాం.

అనుభవం : భయపడక - ఎడతెగక ప్రార్ధిస్తూ, ఆయన సేవలో శ్రమిస్తూ ముందుకు సాగే కృషి చేయడమే సిలువలో క్రీస్తు శ్రమానుభవం.