క్రీస్తుతో 40 శ్రమానుభవములు 30వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు (రోమా 3:23). దేవుడు తన మహిమను మనకివ్వాలని క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పాపముతో, అవిధేయతతో నిండిన మన జీవితాలను కలువరి రక్తములో శుద్ధిపరిచాడు. ఆయన మన అతిక్రమ క్రియలనుబట్టి గాయపరచబడ్డాడు, మన దోషములకై నలుగగొట్టబడ్డాడు, సర్వలోక శాంతి సమాధానం కోసం సిలువ శిక్ష అనుభవించాడు.

క్రీ.పూ 700 సంవత్సరల ఈ ప్రవచనం 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు మొదటి రాకడలో లో నెరవేర్చబడింది. ఇది నిజం. సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన జీవితాలకు పాపక్షమాపణ కలిగిస్తే, అతడు పొందిన ప్రతి గాయం మనలను పరిశుద్ధపరుస్తూ మన ఆత్మీయ జీవితానికి స్వస్థత కలుగజేస్తుంది.

మన కళ్ళముందు ఈ సత్యం ఋజువు అయితే, మనమింకా దేవునికి దూరంగా జీవిస్తూ ఆయన మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నామని గ్రహించాలి. ఆయన...నమ్మకస్తులైనవారు లోకములో ఎవరైనా ఉన్నారా అని ఆకాశమునుండి మనవైపు చూస్తున్నాడు. లోకములో లోకముతో జీవించే జీవితాలు దేవునికి భయపడక అవిధేయతతో అంధకారంలో ఉన్నాయి. ఈవిధంగా ఆధునిక మానవుడు జీవిస్తున్నాడు.

ఆయన మహిమ భూమి మీదకు రావడానికి ఆటంకంగా ఉన్నప్పుడు భయంకరమైన ఉపద్రవాలతో, మరణకరమైన తెగుళ్లతో తన కోపాగ్ని దేవుడు బయలుపరచి మన జీవితాలను మార్చుకోమని హెచ్చరిస్తున్నాడు.

భయముతో, వణకుతో క్రీస్తు శ్రమానుభవమును జ్ఞాపకము చేసుకోవాలి. తన ప్రేమను చూపించడానికి, మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెనను సంగతి జ్ఞాపకము చేసుకోవాలి.

ప్రతి శ్రమలో దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో కొన్నిసార్లు దేవుడు మనలను శిక్షిస్తాడు. "నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము" (ప్రకటన 3:19) అని ప్రభువు హెచ్చరించిన రీతిగా మారుమనస్సు కలిగి అయన శిక్షలో, శిక్షణలో అనుదినం మన జీవితాలను సరిచేసుకొని లోతైన ప్రార్ధనా అనుభవాలు కలిగియుండేలా జీవిద్దాం. సమర్పణ సిద్ధపాటుకలిగి ఒకరికొరకు ఒకరము ప్రార్ధిస్తూ జీవించుటకు ప్రయతినిద్దాం దేవుని ఉగ్రతనుండి తప్పించుకుందాం.

అనుభవం :
సిలువ యాగంలో గాయాలు క్రీస్తు శ్రమానుభవాలు
మన జీవితాలను సరిచేసే ఆత్మీయ స్వస్థతానుభవాలు.