క్రీస్తుతో 40 శ్రమానుభవములు 34వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను. మార్కు 8:34

క్రీస్తును క్రియల్లో చూపించి అనుదినం సిలువను మోసేవాడు క్రైస్తవుడైతే. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని వెంబడించేవాడు... యేసు క్రీస్తు శిష్యుడు.

తనను తాను ఉపేక్షించుకోవడం అంటే?
సన్యాసిలా ప్రాపంచిక సుఖాలను వదిలేయడం కాదు గాని, మన స్వంత స్వలాభాన్ని మరచిపోవడం. అంటే, మన అనుదిన కార్యాచరణలలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి జీవించడం. ఈ లోక సంబంధమైనది మరియు దేవునికంటే ఎక్కువగా ప్రేమించేది అది ఏదైనా వాటిని క్రీస్తు కొరకు వదిలేయడం, పోగొట్టుకోవడం లేదా నష్టపరచుకోవడం. ఇహలోక పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్ఠలు, అహంతో కూడిన హోదాలు, అహంకారంతో నిండిన అధికారాలు క్రీస్తు నిమిత్తం వాటిని సిలువేయడమే ఉపేక్షించుకోవడం.

తన సిలువయెత్తికొని వెంబడించడం అంటే?
సిలువలో క్రీస్తు ఎటువంటి శ్రమలను భరించాడో అట్టి శ్రమలను మన జీవితాల్లో అనుభవించడం. మరణం వరకు విడనాడని విశ్వాసం. సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితం. పరిచర్య కొరకైన పట్టుదల. సువార్తను ప్రకటించాలనే ఆశక్తి. ఆత్మల కొరకైన భారం. క్రీస్తులో పరిపూర్ణ శిష్యత్వం.

అపో. పౌలు యేసు క్రీస్తుతో గల తన శిష్యత్వ అనుభవాన్ని ఇలా వివరించారు "నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు"

యేసు క్రీస్తుతో శిష్యత్వం జీవితకాలంతో ముగుస్తుంది, మరణంతో కాదు. ఇది జీవితకాల సంతృప్తి నెరవేర్పులతో సంపూర్తి అవుతుంది. సిలువ, దానిని మనం కనుగొనగల ఏకైక మార్గం. ఆ సిలువయెత్తికొని వెంబడించగలిగే జీవితమే క్రీస్తుతో శ్రమను అనుభవించడం.

అనుభవం: అనుదినం సిలువను మోస్తూ క్రీస్తును వెంబడించే జీవితమే సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం.