క్రీస్తుతో 40 శ్రమానుభవములు 37వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

లూకా 23:26-31 “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.”

ఆ రోజు శుక్రవారం పస్కా పండుగతో సంతోషంగా ఉండాల్సిన పట్టణం అలజడితో నిండి ఉంది. సంతోషం, విషాదం కలగలిసిన ప్రజలు గొల్గొతా మార్గంలో గుంపులు గుంపులుగా ఉన్నారు. కొరడా దెబ్బలతో కొట్టబడి చీరిపోయిన యేసు ప్రభువు యొక్క శరీరం నుండి రక్తం కారుతూ ఉంది. నీరసించిపోయిన ప్రభువు తాను మోస్తున్న సిలువ క్రింద సొమ్మసిల్లి పడిపోయాడు. సైనికులు ఆయనను బలవంతంగా లేపుతున్నారే కాని ఆయన లేవలేకపోతున్నాడు. ఆగిపోయిన సిలువ యాత్రను ఎవరితో కొనసాగించాలో తెలియని పరిస్థితి.

ఉన్మాద యూదా మత నాయకులు, ప్రధాన యాజకులు కుమ్మక్కై - నీతిమంతుడు, నిందారహితుడు నజరేయుడైన యేసును నిందించి, దూషించి, పిడిగుద్దులు గుద్ది, ముఖముపై ఉమ్మివేసి, అన్యాయపు తీర్పు తీర్చి, కొరడాలతో కొట్టించి సిలువ మరణానికి అప్పగించారు. అక్కడ జరుగుతున్న నరమేధాన్ని చూసిన కురేనీయుడైన సీమోను హృదయం చలించిపోయింది. మానవత్వం మంటగలిసిన ఘోర కార్యాన్ని బిత్తరపోయి చూస్తుండిపోయాడు.

యేసు ఎవరో, సిలువను ఎందుకు మోయవలసివచ్చిందో సీమోనుకు తెలియదు. ఈ సిలువ యజ్ఞం ప్రవచనాల నెరవేర్పని బొత్తిగా తెలియదు. సీమోనుకు తెలిసినదల్లా మానవత్వమే. మానవత్వపు విలువలతో ప్రభువు కళ్ళలోకి చూచాడు. ఏ కనుదృష్టి ఈ లోకాన్నంతా పరీక్షించి చూస్తుందో ఆ ప్రభువు దృష్టిలోపడిన సీమోను తన గమ్యాన్నే మార్చివేసుకొన్నాడు. నాకెందుకులే అనుకోకుండా, సిలువ మోయుటే తన కర్తవ్యం అన్నట్లుగా, ప్రభువుతో పాటు సిలువను భుజానవేసుకొని సిలువ యాత్రను కొనసాగించాడు. ప్రభువు యొక్క అపారమైన శక్తి, పైశాచిక శక్తులపై ఆయన విజయం చూసి తరించాడు. ఎన్నడూ చూడని సుదీర్ఘమైన సూర్యగ్రహణంతో కలిగిన చీకటి చూసాడు, ఆ చీకటిలో యేసు ప్రభువు సిలువలో మాట్లాడిన మాటలు విన్నాడు తన జీవితంలో కొత్త వెలుగులను చూశాడు. సిలువలో యేసు పలికిన ఏడు మాటలు జీవపు బాటలుగా గ్రహించాడు. సిలువ శ్రమలో తనవంతు పాత్ర పోషించిన కురేనీయుడైన సీమోను జీవితం ధన్యమైంది.

అనుభవం : క్రీస్తు సిలువ భారాన్ని భుజాలను మార్చుకోగలిగిన మానవత్వ సహనమే క్రీస్తుతో శ్రమానుభవం.