క్రీస్తుతో 40 శ్రమానుభవములు 38వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 1 పేతురు 5:4

మనిషి తమ జీవితాల్లో బంధీయైన కలలను త్వరితంగా ఋజువు చేసుకోవాలని అడుగులు ముందుకు వేస్తుంటే, మృత్యువు ఒడిలోకి పడద్రోయాలని, ఆధునిక మాధ్యమాలతో అపవాది అనుదినం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ ఆధునికత మనిషిని సమాజంలో ఒంటరితనానికి గురి చేసిందని నా ఆలోచన.

ఇదిలాఉంటే, జీవన వ్యవస్థలో ఎన్ని వైరుధ్యాలున్నా క్రైస్తవ విశ్వాసంలో ఎటువంటి మార్పులు ఉండకూడదని నా అభిప్రాయం. ఈ వ్యవస్థను సరి చేయాలంటే క్రైస్తవ విశ్వాస క్రమశిక్షణలో రూపావళి మార్పు కావలి. అటు దైనందిక జీవితాన్ని ఇటు ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని వాక్యంతో సంతులనం చేయగలిగితే ఒంటరితనాన్ని అధిగమించడమే కాకుండా వ్యవస్థల్లో ఎన్ని మార్పులు కలిగినా ఎదుర్కోగల శక్తిని పొందుకోగలం. మన వ్యక్తిగత వ్యూహాలు ఆధ్యాత్మిక స్థితిగతుల వైపుంటే, సామాజిక సంఘ వ్యవస్థలో క్రొత్త ధోరణి చూడగలం.

నేనంటాను, సమాజానికి సంఘం కేంద్రబిందువుగా ఉండగలిగితే, ఆ సంఘంలో ఆత్మీయ కుటుంబాన్ని మనం ప్రార్ధనతో కట్టుకోగలిగితేనే, దైనందిక ఆధ్యాత్మిక జీవితాల్లో నిరుపమాన మార్పులు చూడగలం. అనుదినం క్రీస్తుతో శ్రమానుభవాలు కలిగి జీవిస్తున్న జీవితం చివరకు రెప్పపాటులో కలిగే క్రీస్తు రాకడలో మార్పు పొందగలదు. సంపూర్ణ సమర్పణా సిద్ధమనసుతో ఈ అనుభవాలగుండా మనం ప్రయాణిస్తూ క్రీస్తును ఎదుర్కొన్నప్పుడే వాడబారని మహిమ కిరీటము పొందగలం. హల్లెలూయా!

ఓ స్నేహితుడా, ఈ లోక దురాశను విడిచి శుభప్రధమైన నిరీక్షణతో ప్రభువు రాకడకొరకు ఎదురుచూడు. దేవుని రాకడ ఈ రోజే వస్తే సిద్ధమా?

అనుభవం: క్రీస్తు శ్రమానుభవాల్లో దైనందిక జీవితం, క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు వాడబారని మహిమా కిరీటం.