క్రీస్తుతో 40 శ్రమానుభవములు 40వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను. ప్రకటన 2:10

సుమారు దశాబ్ధ కాలంనుండి జరుగుతున్న మార్పులు సామాన్య జీవనం నుండి ఆధునికత నేపథ్యంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పరిధులులేని మానవుని జీవనశైలిలో కలిగే మార్పులను నిదానించి గమనిస్తే ఇహలోక సంబంధమైన వాటి విషయంలో మనిషి లోతుగా కూరుకుపోయాడని అర్థమవుతుంది. కారణం? ఆత్మీయ విషయాలలో బలహీనతేనని నా అభిప్రాయం.

క్రీస్తును నామకార్థంగా విశ్వసిస్తే ఎటువంటి ప్రయోజనం లేదు. సిలువలోని క్రీస్తు త్యాగం..సిలువ మేకులపై అంటిన రక్తపు మరకలే సాక్ష్యం. సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ "నా కొరకే" అనే ఆలోచన మనిషి జీవిత కొలతల్నే మార్చేస్తుంది. సిలువపై క్రీస్తు శ్రమను పరికించి చూస్తే భవితవ్యం కనిపిస్తుంది.

అనుదిన జీవన శైలిలో ప్రార్థనకు మనమిచ్చే ప్రాధాన్యత మన ఆధ్యాత్మిక జీవితపు లోతును తెలియజేస్తుంది. లౌకిక జీవితంలో ఆత్మీయ విషయాలకు సమయం కేటాయించలేనప్పుడు, వీటి పరిణామం... రోజువారి జీవితం బలహీనపడి సమతుల్యత కోల్పోతుంది. దీనిని సుళువుగా ఎదుర్కొనగలిగే క్రైస్తవుని జీవనశైలి ఆధ్యాత్మికతతో పరుగెత్తాలంటే దైనందిక జీవిత పునాదుల్లో లోతైన విశ్వాస అనుభవం కలిగియుండాలి. ప్రార్ధనతో అధిగమించగలిగే విశ్వాసి స్పందన నేడు అవసరం అనివార్యం.

క్రీస్తుతో అనుదినం మనం పొందగలిగే శ్రమానుభవాల రేఖలు సాధారణ జీవితంలో కొత్త వెలుగులు చిమ్మే విజయ మార్గాలు. ఈ అనుభవం రాకడ కొరకైన సిద్ధపాటులో నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై మధ్యాకాశములో క్రీస్తును ఎదుర్కొనే కృపను కలుగజేసి పరలోకరాజ్యాన్ని ప్రవేశించే భాగ్యాన్నిస్తుంది. ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొని మరణం వరకు నమ్మకంగా జీవించే జీవిత సాఫల్యమే నిత్యరాజ్యంలో జీవ కిరీటం. ఇట్టి ధన్యత ప్రభువు మనందరికి దయజేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.

అనుభవం: నిత్యజీవం కొరకై క్రీస్తుతో శ్రమానుభవం, నిత్యరాజ్యంలో జీవకిరీటం.